09-01-2026 07:35:42 PM
ఎర్రపహాడ్ సర్పంచ్ గార్డుల లింగరాజు
నూతనకల్,(విజయక్రాంతి): గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, స్వచ్ఛందంగా సహకరించాలని మండల పరిధిలోని ఎర్రపహాడ్ గ్రామ సర్పంచ్ గార్డుల లింగరాజు కోరారు. శుక్రవారం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రామంలో మంచినీటి సమస్య తలెత్తకుండా సర్పంచ్ ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలోని పలు వీధుల్లో నూతనంగా బోర్లు వేయించారు.
తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా వెంటనే మోటర్లను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లింగరాజు మాట్లాడుతూ... గ్రామాన్ని అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని, ప్రజల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తానని, ఈ ప్రయాణంలో ప్రజలంతా సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సత్యవతి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.