07-08-2025 12:27:55 AM
పెద్దపల్లి, ఆగస్టు -6 (విజయ క్రాంతి); ప్రభుత్వ వైద్యం పై ప్రజలలో నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.బుధవారం కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.టీబీ ముక్త్ భారత్, సీజనల్ వ్యాధుల నియంత్రణ అంశాలపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరో గ్య కేంద్రం సబ్ సెంటర్ పరిధిలో లక్ష్యాలను నిర్దేశించుకొని లక్షణాలు గల ప్రతి ఒక్కరికీ నిర్ధారణ పరీక్షల నిర్వహించాలని, ప్రతి ఫ్రై డే డ్రై డే కార్యక్రమం పక్కాగా జరగాలని అన్నారు.
మనం తక్కువ ఇండ్లు కవర్ చేసినా నాణ్యతతో చేయాలని, నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని, సీజనల్ వ్యాధులు నియంత్రణ కోసం అవసరమైన చర్యలు పటిష్టంగా తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ పేషంట్ వచ్చే రోగులకు వ్యాధి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మన జిల్లాలో ఎక్కడ డెంగ్యూ, మల్లేరియా కేసు వచ్చినా పరిసర ప్రాంతాల్లోని 50 ఇండ్లకు ఫీవర్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ అన్నారు.
ఆసుపత్రిలో అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు అందుబాటులో పెట్టుకోవాలని అ న్నారు. 102 వాహనాల ద్వారా గర్భిణీ మహిళలకు సకాలంలో చెక్ అప్ జరిగేలా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న యంత్రాల మరమ్మత్తులు ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆగస్టు 11న జరిగే నులి పురుగుల నివారణ మందుల పంపిణీ కట్టుదిట్టంగా జరగాలని, 19 సంవత్సరాల వయసు లోపు పిల్లలకు మందులు పంపిణీ చేయాలని, ఆ రోజు మిస్ అయిన పిల్లలకు ఆగస్టు 18న తప్పనిసరిగా మందు అందేలా చూడాలని,పెద్దపల్లి జిల్లాలో అధికంగా సీజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, వీటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.