04-08-2025 10:44:54 PM
జిపి కార్మికుడు మడకం విజయ్ కుటుంబాన్ని పరామర్శించిన సీఐటీయూ నాయకులు..
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): మర్రిగూడెం గ్రామపంచాయతీకి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు మడకం విజయ్ ఆగస్టు 1న విద్యుత్ షాక్ తో దుర్మరణం చెందాడని ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాల ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్(CITU District Secretary Ratnam Rajender) డిమాండ్ చేశారు. విజయ్ కుటుంబ సభ్యులను సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికుడు మడకం విజయ్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఆ కుటుంబంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్మికులు చనిపోతే ప్రభుత్వ అధికారులు కనీసం వారి కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణమైన చర్య అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు ప్రమాదాలకు గురై పిట్టల్లా రాలిపోతున్న కూడా ప్రభుత్వం వారి కోసం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని అన్నారు. వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ములుగు జిల్లా కేంద్రానికి చెందిన బలుగూరు సారయ్య అనే గ్రామపంచాయతీ కార్మికుడు విధుల్లో ఉండగా లారీ యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబానికి ఇంతవరకు ఏ ఒక్క సహాయం కూడా ప్రభుత్వం చేయలేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల రక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు ఎనమల్ల రంజిత్ కుమార్, తాటి శ్రీనివాస్, రాగం సంతోష్, గుండమల్ల మధుబాబు, శాంతమూర్తి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.