04-08-2025 10:39:42 PM
రోడ్ల నిర్మాణానికి వంద కోట్లు కేటాయించాలి..
6 జరిగే మండల బంద్ కు ప్రజల సహకరించాలి..
వెంకటాపురం, రామచంద్రాపురం ఆలుబాక ఎదిర కేంద్రాలలో సిపిఎం శ్రేణులు రాస్తారోకోలు
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): మండలంలో ధ్వంసం అయిన రోడ్ల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొప్పుల రఘుపతి(District Secretary Member Koppula Raghupathi) అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో గత రెండు సంవత్సరాలుగా ఇసుక లారీల వల్ల రోడ్లు పూర్తిస్థాయిలో ధ్వంసం అయినవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర విడనాడాలని డిమాండ్ చేశారు. రోడ్ల నిర్మాణాన్ని ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో నాణ్యత, నాణ్యమైన రోడ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. రాళ్లవాగు బ్రిడ్జితోపాటు, కుక్క తోర్రె బ్రిడ్జి కూలడానికి సిద్ధంగా ఉందని, పై రెండు బ్రిడ్జిల పక్కనే వెంటనే కొత్త బ్రిడ్జిల నిర్మించాలని డిమాండ్ చేశారు.
రోడ్లకు నిధులు వచ్చేంతవరకు సిపిఎం పార్టీ ఆందోళన, పోరాటాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రోడ్ల విధ్వంసనానికి కారణమని విమర్శించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కార్యదర్శి గ్యానం వాసు మాట్లాడుతూ ఈనెల 6 తేదీన జరిగే మండల బంద్ ను జయప్రదం చేయాలని మండలంలోని రామచంద్రాపురం, ఆలుబాక, ఎదిరలతో పాటు మండల కేంద్రంలో కూడా పార్టీ శ్రేణులు రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ తమ ఆదాయం కోసం ఇసుక ర్యాంప్ లకు అనుమతులు ఇచ్చి, ప్రజలకు రవాణా సౌకర్యం లేకుండా చేసిందని ఆరోపించారు.
ఇప్పుడున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఆదాయమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు దశల వారి పోరాటం చేస్తున్నామని ఇకనైనా ప్రభుత్వ స్పందించాలని డిమాండ్ చేశారు. మండలంలో యాకన్న గూడెం వరకు బస్సు సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీ అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 40 గ్రామాల ప్రజలకు బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 6న జరిగే బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు, గిరిజన, దళిత సంఘాలు, బీసీ సంఘాలు సహకరించాలని, అలాగే వ్యాపారస్తులు ఉద్యోగులు, విద్యార్థులు ప్రజలు సంపూర్ణ బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలలో జిల్లా నాయకులు కుమ్మరి శీను, వంక రాములు, మండల నాయకులు పి శ్రీను, పి రాంబాబు, కే వెంకటేశ్వర్లు, ఈ శీను, ఎస్ రంగయ్య, పి కృష్ణ, టీ నాగేశ్వరరావు, చిట్టెం ఆదినారాయణ, కే మాణిక్యం, జి ప్రసాదు, ఎస్ దేవి, నిర్మల, బి సాంబి, ముత్తేసు, రమణయ్య, సమ్మయ్య పాల్గొన్నారు.