09-07-2025 12:20:07 AM
పసుపు నీళ్లతో ప్రెస్‌క్లబ్‌ను శుద్ధి చేసిన కాంగ్రెస్ నాయకులు
ఖైరతాబాద్; జూలై 8 (విజయక్రాంతి) : భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని దూషిస్తూ రాజకీయం చేస్తున్నారని యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు బోయ నరేశ్, నలికళ్ల నరేశ్, శ్రీకాంత్ యాదవ్ లు దుయ్యభట్టారు. ఇలా చేస్తే తెలంగాణ ప్రజలు కేటీఆర్ పై తిరగబడతారని హెచ్చరించారు.
ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ చాలా రోజుల ముందే తయారవుతుందన్న సోయి కూడా కేటీఆర్ కు లేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిన సంగతి తెలిసి కూడా చర్చకు సిద్ధం అంటూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చి రచ్చ చేయటం దేనికి సంకేతమన్నారు.
ప్రజలను అయోమయానికి గురి చేసే రాజకీయాలను మానుకోవాలని హిత వు పలికారు. మంగళవారం కెటిఆర్ రాకతో ప్రెస్ క్లబ్ మలినమైందని పలువురు కాంగ్రె స్ నేతలుసోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. ఉచిత బస్సు, రైతు భరోసా, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నందుకు సిఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలా అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో చర్చకు రమ్మంటే రాకండా ఫాంహౌ స్లో ఉన్న చరిత్ర బీఆర్‌ఎస్ నాయకులదని విమర్శించారు. గత పడేళ్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులు వివక్షకు గురయ్యారని తెలి పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు జగన్ యాదవ్, ఖదీర్. పరమేశ్ యాదవ్, సన్ని కె.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.