calender_icon.png 19 November, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజేష్ మృతిపై ప్రజల ఆందోళన

19-11-2025 12:43:12 AM

-పోలీసుల చిత్రహింసల వల్లే చనిపోయాడని బంధువుల ఆరోపణ

-న్యాయం చేయాలని డిమాండ్

-కోదాడ పోలీస్ స్టేషన్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత

-న్యాయం చేస్తానని ఆర్డీవో హామీ

కోదాడ, నవంబర్ 18(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రిమాండ్‌లో ఉన్న కర్ల రాజేష్ (30) అనారోగ్యంతో మృతిచెందిన ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజేష్ మృతి పోలీసుల చిత్రహింసల వలన జరిగిందంటూ మంగళవారం అతని బంధువులు, ఎస్సీ కాలనీకి చెందిన వందలాది మంది ప్రజలు పట్టణ పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్ చెక్ కేసులో ఈనెల 4న రాజేష్‌ను చిలుకూరు పోలీసులు విచారణకు పిలిచి 10న రిమాండ్‌కి పంపించారని, అప్పటివరకు పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టారని రాజేష్ తరపు బంధువులు ఆందోళనకు దిగారు. 15నహుజూర్‌నగర్ సబ్‌జైలుకు తరలించారు. రిమాండ్‌లో ఉండగానే ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించినా వైద్యం ఫలించక మృతి చెందాడు.. అరెస్టు నుంచి రిమాండ్ వరకు రాజేష్‌పై జరిగిన వ్యవహారాలపై పాక్షికత ఉందని వారు ఆరోపించారు.

పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొనగా, డీఎస్పీ అక్కడికి చేరుకుని బంధువులతో చర్చలు జరిపారు. రాజేష్ మృతి పరిస్థితులను పూర్తిగా విచారిస్తామని, అవసరమైతే మేజిస్ట్రియల్ ఎంక్వైయిరీ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఆర్డీవో స్పందించి  రాజేష్ మృతి చాలా బాధాకరమని కుటుంబానికి ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కోదాడ మున్సిపాలిటీలో కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం తోపాటు, కొంత ఆర్థిక సాయం అందించేందుకు జిల్లాకలెక్టర్ తో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. దీంతో డీఎస్పీ, ఆర్డీవో భరోసా మేరకు ఆందోళనను విరమించారు. కాగా తక్షణ కర్చుల నిమిత్తం కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు 50 వేల రూపాయలను రాజేష్ కుటుంబానికి అందిస్తానని హామీ ఇవ్వడం గమనార్హం.