18-09-2025 12:17:21 AM
తుర్కయంజాల్, సెప్టెంబర్ 17: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజల అవస్థలకు కారణమైంది. ముందుచూపుతో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించాల్సిన కల్వర్ట్ పట్ల పాలకులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. చేసిన పనులనైనా సరైన పద్ధతిలో చేశారా? అంటే అదీ లేదు. రోడ్డును సుమారు మూడు మీటర్ల లోతు తవ్వారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారడమే కాకుండా, ప్రజలు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి చేరుకుంది. వివరాల్లోకి వెళ్తే...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి-తొర్రూరు మధ్య కల్వర్టు నిర్మాణం కోసం అధికారులు రోడ్డును తవ్వి వదిలేశారు. తొర్రూరు చెరువు పొంగినప్పుడు అలుగు సాఫీగా పారేలా చేయాలన్నది ఈ కల్వర్టు నిర్మాణ ఉద్దేశం. అయితే, రోడ్డును తవ్వి సుమారు ఏడాదిన్నర గడుస్తున్నా కల్వర్టు పనులు పూర్తికాకపోవడం ఇక్కడ చర్చనీయాంశం. రోడ్డును మరీ లోతుగా తవ్వడంతో చిన్న వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.
చిన్నపాటి వర్షాల నీటికే గుంత నీటితో పూర్తిగా నిండిపోతోంది. దీంతో ఇరు గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కల్వర్టు తవ్విన ప్రాంతంలో కాస్త టర్నింగ్ ఉండటం వల్ల ప్రమాదాలకు నిలయంగా మారింది. గుంత సడెన్గా ఎదురుకావడంతో కొత్తవారు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఇప్పటికే పదుల సంఖ్యలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇటీవల ప్రతిరోజు కురుస్తున్న వర్షంతో కల్వర్టులో ఎప్పుడూ నీరు నిలిచే ఉంటోంది. దీంతో ఈ రహదారిపై ప్రయాణం కష్టతరంగా మారింది. ముఖ్యంగా నగరానికి చదువు నిమిత్తం వెళ్లే విద్యార్థులకు, రైతులకు, ఇతర వ్యాపారస్తులకు తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి.
కల్వర్టు నిర్మాణంపై రాజకీయం...
అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు తమ స్వలాభం కోసమే ఈ కల్వర్టు నిర్మాణం చేపట్టారన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. అలుగు ఒక దగ్గర ఉంటే... మరోచోట కల్వర్టు నిర్మాణానికి పూనుకున్నారని, ఇది దారుణమని స్థానికులు విమర్శలు ఎక్కుపెట్టారు.
చెరువుపై భాగంలో ఉన్న వ్యక్తుల పొలాలు బాగుండటం కోసం, కింద బాగాన ఉన్న తమ పొలాలను నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని బాధితులు ఆందోళనలు కూడా చేశారు. అయినా వెనక్కి తగ్గకుండా, స్థానిక ఎమ్మెల్యేలను, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి కల్వర్టును తవ్వేశారు. దీంతో చేసేదేమీ లేక, నష్టం జరుగుతుందని తెలిసినా బాధితులు మిన్నకుండిపోయారు.
బ్రిడ్జి నిర్మించాలి
తొర్రూరు-బ్రాహ్మణపల్లి మధ్య తీసిన కల్వర్టు అధికార పార్టీ అరాచకానికి నిదర్శనం. ఒకవేళ వారి సంకల్పం నిజమైనదైతే బ్రిడ్జి నిర్మించాలి. వాహనాల రాకపోకలకూ వీలుగా ఉంటుంది. కానీ కల్వర్టు నిర్మాణానికి పూనుకోవడం శోచనీయం. దీని వల్ల వర్షం వచ్చినప్పుడు రాకపోకలకు తీవ్ర అంతరాయం జరుగుతుంది. ఈ కల్వర్టును ఎమ్మెల్యే సొంత మనుషుల ప్రయోజనాల కోసమే నిర్మించినట్టు తెలుస్తోంది.
గుంతలో ఇప్పటికే అనేకమంది వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే మట్టిని నింపుతామని చెప్పారు. ఒకవేళ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోతే... మా సొంత ఖర్చులతో మట్టి తీసుకొచ్చి కల్వర్టును పూడ్చివేస్తాం.
- ఎలిమినేటి నర్సింహారెడ్డి, బీజేపీ అధ్యక్షుడు