calender_icon.png 6 May, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లాక్ గ్రానైట్ మైనింగ్ కు అనుమతులు రద్దు చేయాలి

03-05-2025 10:15:48 PM

చారకొండ: మండలంలోని సిరుసనగండ్ల గ్రామంలో బ్లాక్ గ్రానైట్ తవ్వడానికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాస్ కు గ్రామస్తులు వినతిపత్రం అందశారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచి పసుల శ్రీను, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు విజయ్ మహారాజు మాట్లాడుతూ.. సిరసనగండ్ల శివారులో 182 సర్వే నెంబర్ లో 19 ఎకరాల్లో బ్లాక్ గ్రానైట్ తవ్వడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, దీనిపై ఏప్రిల్ 29న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు నిర్వహించిన సమావేశంలో గ్రామస్తులకు సరైన సమాచారం ఇవ్వకుండా, కాంట్రాక్టర్ తీసుకువచ్చిన బయటి వ్యక్తులతో మైనింగ్ కు అనుకూలంగా మాట్లాడించి గ్రామస్తులు వచ్చేలోపే సమావేశం ముగించారని అన్నారు. 182 సర్వే నెంబర్ మెజార్టీగా దళితుల భూములు ఉన్నాయని మైనింగ్ జరిగితే చుట్టూ ప్రక్కల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం స్పందించి మరో సారి ప్రజాభిప్రాయ సేకరణ చేసి అనుమతులపై పునరాలోచన చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ రైతులు ఈర్లపల్లి శ్రీను, తిరుమలేశ్, గ్యార సురేష్, పాల్గొన్నారు.