03-05-2025 10:34:44 PM
వారం రోజుల వ్యవధిలో మూడు ఘటనలు....
తాజాగా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో అక్రమ సంబంధంతో మహిళ దారుణ హత్య..
పోలీసులకు తలనొప్పిగా మారుతున్న సంఘటనలు...
పెద్దపల్లిలో జనం చూస్తుండగానే కత్తులతో దాడులు...
అనాగరికత వాతావరణంకు దారి తీస్తున్న నేరాలు ఘోరాలు..
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో హత్యల పరంపర కొనసాగుతుంది. గడిచిన వారం వ్యవధిలోనే మూడు సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాత కక్షలు, అక్రమ సంబంధాలు.. క్షణికా ఆవేశాలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. ఈ వరుస నేరాలు.. ఘోరాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి.. మొన్నటికి మొన్న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డులో బహిరంగంగా జనం చూస్తుండగా కత్తితో ఒకరిని నరికి చంపగా, నిన్నటికి నేడు గోదావరిఖనిలో ఒక రౌడీషీటర్ పై హత్యాయత్నం జరిగింది. ఇదే రోజు రాత్రి రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో అక్రమ సంబంధం నేపథ్యంలో మహిళ దారుణ హత్యకు గురైంది.
ఈ వరుస హత్యలతో కోల్ బెల్టు కాస్త క్రైమ్ బెల్ట్ గా మారుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏప్రిల్ 28వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పొలం కుమార్ అనే యువకుడుదారుణ హత్యకు గురైన సంఘటన విధితమే. తన భార్యతో అక్రమ సంబంధం నేరపుతున్నాడన్న నేపంతో ధర్మారం మండలం దొంగ తుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ అనే వ్యక్తి పథకం ప్రకారం కుమార్ ను మాట్లాడే పని ఉందంటూ మార్కెట్ యార్డుకు పిలిపించుకొని తన వెంట తీసుకువచ్చిన కత్తితో మెడ కోసి హత్య చేశాడు. సంఘటన స్థలంలో జనం చూస్తుండగానే రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహంపై నిల్చొని కసితో మళ్లీ మళ్లీ గొంతు నులిమి చంపడం చూసి జనం భయకంపితులయ్యారు.
పోలీసులు వచ్చేదాకా హంతకుడు సంఘటన స్థలంలోనే సేద తీరుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రజలుఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన మరువక ముందే నిన్న పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో పాత కక్షలు కారణంగా పాత నేరస్తుడిని మరో ఇద్దరు పాత నేరస్తులు కత్తులతో దాడి చేశారు. 2021 లో గోదావరిఖని ప్రశాంత్ నగర్ కు చెందిన బండారి మొగిలి హత్య కేసులో అదే కాలనీకి చెందిన చీమల తిరుపతి, రాగుల రాజశేఖర్, బోనగిరి రాకేష్ లు ప్రధాన నిందితులు. జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చారు.
కేసు ఫైనల్ కు వస్తున్న నేపథ్యంలో రాజశేఖర్, రాకేష్ లు రాజీ కుదుర్చుకుందామని తిరుపతికి చెప్పగా అతను ఒప్పుకోలేదు. దీంతో కేవలం క్షణికావేశం కారణంగా తిరుపతిపై ఆ ఇద్దరు రౌడీషీటర్లు కత్తులతో దాడి చేసి పారిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న తిరుపతిని గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు హత్యకు ప్రయత్నించిన ఆ ఇద్దరు నిందితులను పట్టుకొని ప్రశాంత్ నగర్ కు తీసుకువచ్చి ప్రజల సమక్షంలోనే పోలీస్ మార్క్ చూపించారు.
తాజాగా మహిళ దారుణ హత్య
గోదావరిఖనిలో హత్యాయత్నం సంఘటన జరిగిన కొద్ది గంటలకే రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో మరో దారుణ హత్య సంఘటన జరగడం జిల్లాలో మరింత కలకలం రేపింది. గ్రామం చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి నిన్న రాత్రి సదరు మహిళను అతి దారుణంగా హత్య చేసి పారిపోయాడు. ఈ వరుస ఘటనలు జిల్లా పోలీసు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. జిల్లాలో మళ్లీ అనాగరికత వాతావరణంకు దారితీస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.
మోటం సమ్మక్క అనే మహిళ భర్త కొద్ది రోజుల క్రిత చనిపోగా దండేపల్లికి చెందిన కనకరాజు అనే వ్యక్తితో సహ జీవనం సాగిస్తున్నది . కల్వచర్ల గ్రామంలో నివాసం ఉంటున్న సమ్మక్క రెండు రోజుల క్రితం కనకరాజుతో కలిసి తన చిన్నాన్న ఇంటికి వెళ్లింది. మద్యం మత్తులో కనకరాజు సమక్కతో గొడవ కు దిగాడు . అదే ఆవేశంలో సమక్క తలపై ఇటుక రాయితో బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతించెంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి జిల్లా దవాఖానకు తరలించారు. నిందితుడు కనకరాజు పరారీలో ఉన్నట్లు తెలిపారు.