03-05-2025 10:53:07 PM
ఇంటి సరిహద్దులు తేల్చడంటూ ఎమ్మార్వో, ఎంపీడీఓకి వినతిపత్రం..
కల్లూరు (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న ఇంటి స్థలం వివాదాస్పదంగా మారిన ఘటన మండల పరిధిలోని తూర్పు లకారంలోని చోటుచేసుకుంది. తాను నివాసం ఉంటున్న ఇంటి హద్దులను నిర్ధారించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు శనివారం తాసిల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖరకు వినతిపత్రం అందజేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంటి నెంబర్ 1-82/1 గల రేకుల షెడ్డులో ఇలారపు మధు, తండ్రి నగేష్, అతని భార్య ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటిని తన బాబాయి కుమారుడైన ఇలారపు శివ వద్ద కొనుగోలు చేశామని తెలిపారు.
ఏప్రిల్ 25వ తారీఖున అదే గ్రామానికి చెందిన తడికమళ్ల కృష్ణ, మరో వ్యక్తులు కలిసి మా రేకుల షెడ్డును ధ్వంసం చేసి మాపై దాడి చేసి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టారన్నా రు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేశారన్నారు. ఆ తర్వాత మే 2 తేదీన పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన జాబిశెట్టి చిన్న శ్రీను, పెద్ద శ్రీను, మాడిశెట్టి చిన్న శ్రీను వచ్చి డోజర్ తో పడి ఉన్న రేకుల షెడ్డు ను పక్కకు నెట్టడం జరిగిందని తెలిపారు.
గ్రామానికి చెందిన తడికమళ్ల కృష్ణ, లలిత దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఆ ఇంటిని నా స్థలంలో కట్టేందుకు కుట్రపూరితంగా నాపై దౌర్జన్యానికి దిగుతూ నన్ను, నా పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. మాకు ఆ స్థలం తప్ప మరే ఆధారం లేదని, ఉన్న ఇల్లుని పడగొట్టడంతో పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో నా ముగ్గురు పిల్లలతో తలదాసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థలంలో తడికమళ్ల కృష్ణ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండా నిలిపివేయాలని అధికారులను వేడుకుంటున్నట్లు తెలిపారు.. వివాదాస్పదంగా మారిన భూ సమస్యను అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుకున్నారు.