01-08-2025 01:28:25 AM
బీసీ సంఘాల భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్‌కు రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీ రిజర్వేషన్లు పెంచడంతో పాటు రాష్ర్ట బడ్జెట్‌లో నిధులు పెంచి బీసీ సబ్ ప్లాన్ తీసుకువచ్చే దిశగా ఆలోచిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బీసీ ప్రతినిధుల బృందం మహత్మా జ్యోతిబా పూలే భవన్‌లో భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా బీసీ డిమాండ్లపై సుదీర్ఘంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో భట్టి విక్రమార్క చర్చించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడు తూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ర్ట బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరం రూ.20 కోట్లు కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో బీసీలకు కూడా చట్టబద్ధమైన సబ్ ప్లాన్ తీసుకురావాలని, నాలుగేండ్లుగా ఉన్న బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించాలని, హైదరాబాద్‌లో మహాత్మా జ్యోతిబా పూలే నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, పూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను పెంచాలని కోరారు.
డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతోపాటు బీసీల కు నిధుల కేటాయింపుల్లోనూ అన్యాయం జరగకుండా చూస్తామని, హైదరాబాద్‌లో మహత్మా జ్యోతిబాపూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు సష్టం చేశారు.
డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట కార్యనిర్వక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కూర్మ, బీసీ మహిళా సంఘం రాష్ర్ట అధ్యక్షురాలు బీ మనిమంజరి, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి డీ రమ, బీసీ మేధావుల వేదిక నాయకులు ప్రొఫెసర్ వెం కటేశ్వర్లు, ప్రొఫెసర్ శ్రీనివాస్, బీసీ నేతలు రావులకు నరేశ్ ప్రజాపతి, జాజుల లింగం గౌడ్, వేముల నాదం గౌడ్, పానుగంటి విజయ్, జీ నాగరాజు గౌడ్, సత్యం గౌడ్, ఇంద్రమ్ రజక, గౌతమ్, అర్జున్ పాల్గొన్నారు.