calender_icon.png 15 August, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీగా ఉన్నప్పుడు ప్లాన్ చేసిన.. ఇప్పుడు సాధించిన

15-08-2025 12:29:30 AM

  1. హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుతో ఆనందంగున్నది
  2. పదేండ్లలో అధునాతన సౌకర్యాలతో కాలేజీ నిర్మిస్తం
  3. త్వరలోనే సీఎంతో శంకుస్థాపన చేపిస్తం
  4. స్టూడెంట్స్ బాగా చదువుకోవాలె ఫోన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, ఆగస్టు 14 : తాను ఎంపీగా ఉన్నప్పుడు హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలనుకున్న ప్రయత్నం ఇప్పుడు నెరవేరిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. నూతనంగా ప్రారంభమైన శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఆయన గురువారం ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థి నాయకుడిగా ఈ కాలేజీ ఏర్పాటు పట్ల తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట, జనగామ - ఈ నాలుగు జిల్లాలకు మధ్యలో ఉన్న హుస్నాబాద్లో ఈ కాలేజీని ఏర్పాటు చేయడంతో మారుమూల గ్రామాల పిల్లలకు సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. ఐదు కోర్సులతో  తరగతులు ప్రారంభమైన కళాశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు.

గత పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కాలేజీల కన్నా ఇక్కడ అదనపు సౌకర్యాలు, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది ఉన్నారన్నారు. ‘మొదటి బ్యాచ్ మీరే, మీరే కళాశాల అంబాసిడర్లు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరడానికి మీదే మొదటి బ్యాచ్‘ అని మంత్రి విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. రాబోయే పది సంవత్సరాలలో అధునాతన సౌకర్యాలతో కూడిన కళాశాల భవనాన్ని 35 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తానని, దీనికి త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తానని హామీ ఇచ్చారు.

విద్యార్థులు బాగా చదువుకోవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ‘సౌకర్యాల విషయంలో నేను, కలెక్టర్ చూసుకుంటాం. చదవడం మాత్రం మీదే బాధ్యత‘ అని అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధైర్య పడవద్దని, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అకడమిక్ ప్రమాణాలు బాగా ఉండేలా బోధన చేయాలని అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమవతి, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ రవికుమార్, ఆర్డీవో రామ్మూర్తి, ఏసీపీ సదానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.