05-11-2025 01:27:29 AM
పాట్నా, నవంబర్ 4: ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ‘పీఎం -కిసాన్ సమ్మాన్ నిధి’ సాయాన్ని ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచుతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన దర్భంగాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ఎన్డీయే కూటమి ప్రాధాన్యమిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నింటినీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కొత్తగా ఐదు ఫ్యాక్టరీలు నిర్మిస్తామని ప్రకటించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని, వారి పాలనలోనే పెద్ద కుంభకోణాలు జరిగాయని మండిపడ్డారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా రూ.12 లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు.
నితీశ్ ప్రభుత్వం తాజాగా మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయడాన్ని తప్పుబడుతూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సొమ్మును మహిళలకు దక్కకుండా ఆర్జేడీ నేతలు దోచుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. లాలూ తాతలు దిగొచ్చిన ఆ సొమ్మును దోచుకోలేరని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. కాగా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇదే రోజు వైశాలి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.