13-09-2025 01:50:58 PM
గౌహతి: మిజోరాం రాజధానిని తొలిసారిగా భారత రైల్వే(Mizoram railway line) నెట్‌వర్క్‌తో అనుసంధానించే రూ.8,070 కోట్లకు పైగా విలువైన బైరాబి-సైరాంగ్(Bairabi–Sairang line) కొత్త రైల్వే లైన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) శనివారం ప్రారంభించారు. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మోదీ ఐజ్వాల్ చేరుకోలేకపోయారు. కాబట్టి మిజోరాంలోని లెంగ్పుయ్ విమానాశ్రయం నుండి వర్చువల్‌గా ప్రాజెక్టులను ప్రారంభించి, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, "ఈ రోజు నుండి, ఐజ్వాల్ భారతదేశ రైల్వే పటంలో ఉంటుంది... కఠినమైన భూభాగంతో సహా అనేక సవాళ్లను అధిగమించి, ఈ బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ వాస్తవంగా మారింది. మా ఇంజనీర్ల నైపుణ్యాలు, మా కార్మికుల స్ఫూర్తి దీనిని సాధ్యం చేశాయి" అని అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు కొత్త లైన్ మిజోరంలోని సైరాంగ్‌ను రాజధాని ఎక్స్‌ప్రెస్(Sairang to Rajdhani Express) ద్వారా ఢిల్లీతో నేరుగా కలుపుతుందని, రాష్ట్రాన్ని జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించడంలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. దేశం పట్ల మిజోరాం ప్రజలు దీర్ఘకాలంగా చూపిన నిబద్ధతను ప్రధానమంత్రి ప్రశంసించారు. బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ ప్రారంభోత్సవం దేశానికి, మిజోరాం ప్రజలకు ఒక చారిత్రాత్మక దినమని అభివర్ణించారు. ప్రతిపక్షాల ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా, మిజోరం లాంటి సరిహద్దు రాష్ట్రం అభివృద్ధి దెబ్బతిందని ప్రధాని ఆరోపించారు. ఈ రోజు, మిజోరాం రాజధానికి రైల్వే కనెక్టివిటీ(Railway connectivity) లభిస్తుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. బైరాబి-సైరాంగ్ లైన్ పూర్తి గురించి ప్రస్తావిస్తూ, ఇది 45 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలను కలిగి ఉన్న ఒక సవాలుతో కూడిన ప్రాజెక్ట్ అని, వీటిలో ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే పొడవైనది ఒకటి ఉందని ఆయన అన్నారు. ఈ లైన్ మిజోరాంను గౌహతి, కోల్‌కతా, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలతో అనుసంధానిస్తుందని, జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో యాక్సెస్, ఏకీకరణను మెరుగుపరుస్తుందని అశ్విని వైష్ణవ్ వివరించారు.