న్యూఢిల్లీ: గుజరాత్ బ్రిడ్జి(Gujarat Bridge Collapse) కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. 'గుజరాత్‌లోని వడోదర జిల్లాలో వంతెన కూలిపోవడం వల్ల జరిగిన ప్రాణనష్టం తీవ్ర బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వబడుతుంది' అని పీఎంవో ఎక్స్ లో పేర్కొంది.
గుజరాత్‌లోని(Gujarat Bridge Collapses) వడోదరలోని పద్రా తాలూకాలోని గంభీర-ముజ్‌పూర్ వంతెనలోని ఒక భాగం బుధవారం కూలిపోవడంతో పది మంది మరణించగా, అనేక వాహనాలు మహిసాగర్ (మహి) నదిలో పడిపోయాయి. ఆనంద్-వడోదర(Anand and Vadodara ) జిల్లాలను కలిపే ఈ వంతెన ఉదయం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, రెండు ట్రక్కులు, ఒక బొలెరో ఎస్ యూవీ, ఒక పికప్ వ్యాన్ సహా నాలుగు వాహనాలు వంతెనను దాటుతుండగా అకస్మాత్తుగా కూలిపోయాయి. వాహనాలు నదిలో పడటానికి కొన్ని క్షణాల ముందు పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్నిమాపక దళం బృందాలు, స్థానిక పోలీసులు, వడోదర జిల్లా యంత్రాంగం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణ సహాయ చర్యలు ప్రారంభించారు.