calender_icon.png 27 August, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సముచిత అంతర్గత నిర్వహణ

27-08-2025 01:30:53 AM

పాలకుర్తి రామమూర్తి :

దైవప్రమాణః మానుషహీనః నిరారంభః

విపన్న కర్మారంభో వా అవసీదతి

- (కౌటిలీయం -7-11)

ఎవరైతే పురుష ప్రయత్నం చేయకుండా దైవంపైన మాత్రమే ఆధారపడతారో.. వారు ప్రారంభించిన పనులన్నీ చెడిపోయి నశిస్తారు. సంస్థ ఆశించిన ఫలితాలు రావడం లేదంటే.. నిర్వహణలో ఎక్కడో లోపం ఉన్నదని భావించాలే గాని అదృష్టం బాగాలేదనే నిష్కృయాపరత సరికాదు. అదృష్టంపై ఆధారపడి అవకాశాలకై ఎదు రుచూచే కన్నా అవకాశాలను సృజించుకునే మానవ ప్రయత్నమే మిన్న అంటాడు, ఆచార్య చాణక్య. సంస్థలో ‘సముచిత అంతర్గత నిర్వహణ’ వల్ల జటిల సమస్యల పరిష్కారమూ సులువవుతుంది.

ఆశా నిరాశలు, ఇష్టాయిష్టాలు, పొంగు క్రుంగులను ప్రక్కన పెట్టి.. చేసే పనిలో భౌతిక, మానసిక, ఆలోచనా పార్శ్వాలలో ఎదురయ్యే లోపాలను సరిదిద్దుకుంటూ.. పట్టుదలతో, అవిశ్రాంతంగా ప్రయత్నిస్తే అదృష్టాన్ని అదే లాక్కొ స్తుంది. దీనినే తాత్త్వికంగా ‘ఆత్మ నిర్వహణ’గా చెపుతారు. సంస్థ కార్యకలాపాలను నిర్ధారించడం, సంస్థ ఆస్తులను రక్షించడం, సంస్థ లక్ష్యాలను సాధించడానికి ప్రభావవంతమైన నిర్ణయాలను, ప్రక్రియలను ఏర్పరచడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడమే ‘సముచిత అంతర్గత నిర్వహణ’. నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగిం చబడే ఆర్థిక సమాచారపు ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఆర్థిక నివేదికలు రూపొందించడం కూడా ఇందులో భాగమే.

ప్రక్రియల అమలులో పటిష్టమైన నియంత్రణా విధానాన్ని ఏర్పాటు చేయడం, ప్రమాదాలను అంచనావేయడం, వాటిని నివారించే వ్యవస్థను ఏర్పరచి.. దానిని నిబద్ధతతో పర్యవేక్షించడం, స్పష్టమైన సమాచారం మరియు భావవ్యక్తీకరణ వ్యవస్థను రూపొందించడం, సమర్ధవంతంగా దానిని పర్యవేక్షించడం ‘అంతర్గత నిర్వహణ’ వల్ల సులువవుతుంది. పర్యవేక్షణ అనేది అంతర్గత నియంత్రణల ప్రభావాన్ని అంచనా వేసే నిరంతర ప్రక్రియ.

వివిధ సంస్కృతులు, నేపథ్యాల నుంచి వచ్చిన ఉద్యోగులలో నైతిక వర్తన, సంస్థ పట్ల నిబద్ధత, బాధ్యతలను గుర్తించి జవాబుదారీతనంతో వ్యవహరించే దక్షత, సమగ్రత, సహకార సంస్కృతిని పెంపొందించడంలో నాయకత్వం కీలక పాత్ర పోషించాలి.; నాయకుడు నడిచే మార్గంలోనే అనుచరులూ నడుస్తారు కాబట్టి నాయకుడు నిబద్ధతతో వ్యవహరించాలి.

సేవాభావనతోనే..

నాయకుడు కష్టపడి పనిచేయడం, తెలివితో పనిచేయడం వల్ల చేసిన పని సార్ధకమవడమే కాక దాని విలువ పెరుగుతుంది. సంస్థ అనే వాహనానికి నాయకుడు ఇంజన్ లాగా వ్యవహరించాలి. ఉద్యోగులూ సేవాభావనతో కర్తవ్యాన్ని నిర్వహించాలి. సాధారణంగా తీసుకోవడం మాత్రమే అలవడితే అది.. ఉగ్రవాదం.. తీసుకోవడం ఇవ్వడం అలవడితే అది ప్రభుత్వం చేసే పని. ఇవ్వడం తీసుకోవడం అలవడితే అది వ్యాపారం.. కాని ప్రేమతో సమర్పించడం.. కృతజ్ఞతతో స్వీకరించడం అనేది దివ్యత్వం.. అది సేవాభావనలో అలవడుతుంది.

సేవాభావన అంటే వేతనానికి సరిపోయేంతగా పనిచేయడం కాకుండా.. ఎక్కువ సేవలను అందించడం. అదే సమర్పణాభావన. ఎక్కువగా సమర్పించడం అంటే ఎక్కువగా పొందడమే. సమస్యలకు మూలమైనది సందిగ్ధత. సందిగ్ధత తొలగిపోతే విజయపథం స్పష్టమౌతుంది. స్పష్టత సమస్యలను సవాళ్ళుగా మారుస్తుంది. సాహసం సమస్యలను సవాళ్లుగా స్వీకరిస్తే.. ధైర్యం పరిష్కారానికి మార్గం కనిపిస్తుంది. దానికి; బాహ్యప్రేరణ కన్నా సానుకూలమైన అంతః ప్రేరణయే ఉపయుక్తమౌతుంది. అంతశ్చేతనలో సాధించాలనే జ్వలన తీవ్రమైతే ఉత్తమ ఫలితాలు ఆవిష్కృతమౌతాయి.

హృదయంలో పొంగివచ్చే ఉత్తేజం, ఉత్సాహం ఎదుటి వారితో సంబంధాలను పటిష్ట పరుస్తుంది. ముఖంపై చిరునవ్వు స్వచ్ఛతను, నిష్కల్మషత్వాన్ని ప్రకటిస్తుంది. బుద్ధిలోని స్ఫురణ పరిష్కారాలను సూచిస్తుంది. అసత్యాన్ని పలకకపోవడం, సత్యాన్ని మాత్రమే పలకడం వల్ల నాయకునిపై విశ్వసనీయత పెరుగుతుంది. గీత ‘ధర్మం’తో ఆరంభమౌతుంది.. ‘మమ’తో అంతమౌతుంది. అంటే ధర్మం.. మమ .. దానినే విపరీతం చేస్తే.. ‘మమ ధర్మం’ లేదా ‘నాధర్మం’ అవుతుంది. ;కర్తవ్యాన్ని తన ధర్మంగా భావించిన నాయకుడు.. ఫలితాలపై కాక ప్రక్రియపై దృష్టిని కేంద్రీకరిస్తాడు.. ఫలితమేదైనా ఆనందంతో ఆస్వాదిస్తాడు.

ముఖ్యమైన నాలుగు లక్షణాలు

శ్రద్ధాసక్తులు కలిగిన నాయకుని ప్రతిభను, ప్రభావాన్ని నిర్ణయించేందుకు... అతనిలో సమయపాలన పట్ల నిష్ఠ, తోటివారిపై షరతులు లేని ప్రేమ, సత్యధర్మాలను వ్రతాలుగా పాటించడం, బాధ్యతాయుతంగా, అంకిత భావంతో పనిచేయడం.. లాంటి నాలుగు లక్షణాలు ప్రామాణికంగా తీసుకోవచ్చు. వీటిని పాటించే నాయకుడు సమస్యల పట్ల ఉదాసీనంగా ప్రవర్తించడు. మసిబూసి మారేడు కాయలు అమ్మిన ట్లుగా కాకుండా మానసికమైన మార్పును ఆహ్వానిస్తాడు. ఆలోచనా విధానం ఉన్నతీకరించబడి వ్యక్తిత్వం పరివర్తన చెందుతుంది. భౌతికంగా, మానసికంగా, బుద్ధిపరంగా పూర్తిగా రూపాంతరం చెందుతాడు.

ప్రతిభ వికాసం చెంది.. చెప్పినది ఆచరించడం, ఆచరించేదే చెప్పడం, చెప్పినదానినే అనుభూతి చెందడం, అనుభూతిని ప్రకటించడం.. ప్రవర్తనగా చేసుకుంటాడు. “క్రతోస్మర, కృతం స్మర” .. నీ సంకల్పాన్ని గుర్తు చేసుకో.. కర్తవ్యాన్ని ఎంతవరకు నిర్వహించావో గుర్తుచేసుకో... అంటుంది.. ఈశావాస్యోపనిషత్తు. సగం నీటితో నిండిన పాత్రలోని నీరు.. నీవు సాధించిన దానిని.. ఖాళీభాగం.. నీవు సాధించాల్సిన దానిని గుర్తుచేయడమే కాక అవకాశాలను స్పురింప చేస్తున్నది. సంస్థ ప్రగతికి విజ్ఞానం అవసరమే కాని విజ్ఞానమే ప్రగతిని సాధించదు. విజ్ఞా నాన్ని ఆచరణలో పెట్టి వివేచనగా మార్చుకోవాలి.

విజ్ఞానానికి.. సంబంధిత రంగంలో జ్ఞానం, అవసరమైన సమాచారం, లోతైన.. విస్తృతమైన చింతన, సరైన పరిష్కారం అనే నాలుగు పార్శ్వాలుంటాయి. జ్ఞానం భూతకాలానికి సంబంధిం చినది. ఏమి చేసాము, దాని ఫలితం ఏమిటి?; దానితో నేర్చుకున్న దేమిటి? దానినే ‘జ్ఞానం’గా చెపుతారు. సమాచారం వర్తమానానికి సంబంధించినది.

జరుగుతున్న దేమిటి? విస్తృత పరిధి లో లోతుగా విశ్లేషించుకోవడం ‘సమాచారం’. దానిని మరింత సమర్ధవంతంగా ఎలా నిర్వహించ గలమో ఆలోచించడం ‘చింతన’.. సమస్య లను అధిగమించే మార్గాలను అన్వేషించడం ‘పరిష్కారం’. ఈ నాలుగింటి సమష్టి సమన్వయమే దార్శనికతగా చెప్పబడుతుంది. దార్శనికులకే అత్మనిర్వహణ సాధ్యపడుతుంది. ‘సముచిత అం తర్గత నిర్వహణా’ సామర్ధ్యమే భౌతిక ఆధ్యాత్మిక జీవితాలలో ప్రగతిని సుగతిని అనుగ్రహిస్తుంది.