07-01-2026 01:36:32 PM
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే వర్గం బుధవారం ఎన్డీఏలో చేరింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ఆ పార్టీ నాయకుడు ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామిని కలిశారు. తమిళనాడులో జాతీయ ప్రజాస్వామ్య కూటమికి (National Democratic Alliance) ఏఐఏడీఎంకే నాయకత్వం వహిస్తోంది. రామదాస్ అధికారికంగా కూటమిలో చేరడానికి తన నివాసంలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిని కలిశారు. ఈ కూటమిలో బీజేపీ కూడా ఒక భాగస్వామిగా ఉంది. "పట్టాలి మక్కల్ కట్చి(Pattali Makkal Katchi) మా కూటమిలో చేరింది. త్వరలోనే మరిన్ని పార్టీలు ఈ కూటమిలో చేరతాయి." అని పళనిస్వామి విలేకరులతో అన్నారు. పీఎంకేకు సీట్ల కేటాయింపు ఖరారైందని, దానిని తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
ప్రజా వ్యతిరేక డీఎంకే పాలకులను ఓడించడానికే తాను ఎన్డీఏ కూటమిలో చేరానని పీఎంకే నాయకుడు అన్నారు. ఎన్డీఏ కూటమికి బలమైన తీర్పు లభిస్తుందని, అన్నాడీఎంకే సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పళనిస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి భాగస్వాములు దీని కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తారన్నారు. ఇద్దరు నాయకుల మధ్య అధికార పోరు కారణంగా పీఎంకే పార్టీ దాని వ్యవస్థాపకుడు రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి మధ్య చీలిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో ఈ పార్టీ ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. మరోవైపు పన్నీరు సెల్వం, టీటీవీ దినకరన్ శశికళతో చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.