calender_icon.png 8 October, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవోకే హింసాత్మకం

02-10-2025 12:52:06 AM

పాకిస్తాన్ సర్కారుకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో భారీ నిరసనలు చెలరేగాయి. తమ హక్కుల అణచివే తపై స్థానికంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ, ఆర్థిక అణచివేతను నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పౌర సమాజ కూటమి అయిన అవామీ యాక్షన్ కమిటీ (ఏసీసీ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది.

పీవోకేలో మౌలిక సంస్కరణలు తీసుకు రావాలని, అంతేకాకుండా తమ 38 డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ‘షటర్ డౌన్.. వీల్ జామ్’ పేరుతో ఏసీసీ కమిటీ నిరసనలు చేపట్టింది. అయితే మూడు రోజులుగా శాంతియుతంగా సాగుతున్న నిరసనలు తాజాగా హింసాత్మకంగా మారింది. నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభుత్వం పెద్ద సంఖ్య లో ఆర్మీ బలగాలను మోహరించింది.

పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణ నుంచి తమకు స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేస్తూ జనం కదం తొక్కడంతో భీతావహ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్మీ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 10 మంది పౌరులు చనిపోగా.. వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా తమకు అన్యాయం జరుగుతున్నదంటూ పీవోకేలో అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమం ప్రారంభిం చింది. ఆదివారం నుంచి ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.

మొ త్తం 38 డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చిన ఏసీసీ కమిటీ.. ప్రభు త్వం వాటిని నెరవేర్చేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేసింది. 38 డిమాండ్లలో ప్రధానంగా మూడింటి కోసం మాత్రం పెద్ద ఎత్తునే ఆందోళనలు జరుగుతున్నాయి. పీవోకే అసెంబ్లీలో పాకిస్తాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశా రు. ఈ సీట్ల వల్ల స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.

వీటితో పాటు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో జనంలో అస హనం పెరిగిపోయింది. గోదుమ పిండిపై సబ్సీడీ ఇవ్వాలని, పీవోకేలోని మాంగ్లా డ్యామ్, నీలం ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 60 శాతం పాకిస్తాన్‌కే సరఫరా కావడం ఆగ్రహం తెప్పించింది. దీంతో మాంగ్లా జల విద్యుత్ ఆధారంగా కరెంటు చార్జీలను తగ్గించాలని స్థానికు లు కోరుతున్నారు. ఇవన్నీ కలిసి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజా ఉద్యమాన్ని ప్రేరేపించేలా చేశాయి.

గత 70 ఏళ్లుగా పాక్ ప్రభుత్వం తమను క్రూరంగా అణచివేస్తోందని, కనీస హక్కులు కూడా కల్పించడం లేదని అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ పేర్కొన్నారు. ఇప్పటికే పీవోకే ప్రజల ఓపిక నశించిందని, అందుకే పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. తమ డిమాండ్లు ఇప్పటికైనా నెరవేర్చకపోతే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు హెచ్చరి కలు జారీ చేశారు.

మరోవైపు పీవోకేలో ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ సర్కారు చర్యలు చేపట్టింది. భారీ సంఖ్యలో సాయుధ బలగాలను రంగంలోకి దించింది. సమీపంలోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి వేలాది మంది సైనికులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరుకున్నారు. అయితే ఉద్యమ అణచివేతకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పీవోకేలో ప్రజా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసిందనే చెప్పొచ్చు.