calender_icon.png 25 November, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ గస్తీ

25-11-2025 12:00:00 AM

సైరన్ లేకుండా సాధారణ వాహనంలో లంగర్‌హౌస్, టోలిచౌకిల్లో పర్యటన

రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి, నేర ప్రవృత్తిని వీడాలని వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్!

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి సాధారణ పెట్రోలింగ్ వాహనంలో స్వయంగా గస్తీ నిర్వహించి, రౌడీషీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లి వారిని నిద్రలేపి హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి సీపీ సజ్జనార్ ఎలాంటి అధికారిక కాన్వాయ్, సైరన్ హంగులూ లేకుండా సౌత్-వెస్ట్ జోన్‌లోని లంగర్‌హౌస్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకస్మిక పర్యటన చేపట్టారు.

రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు సాధారణ పెట్రోలింగ్ వాహనంలోనే తిరుగుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిం చారు. లంగర్‌హౌస్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆశాంనగర్, డిఫెన్స్ కాలనీల్లోని రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లారు. వారిని నిద్రలేపి, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి మార్గాలపై ఆరా తీశారు. నేర ప్రవృత్తిని పూర్తిగా వీడి, సన్మార్గంలో నడవండి. మళ్లీ పాత కేసుల్లో వేలుపెట్టినా, కొత్తగా నేరాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

టోలిచౌకిలో నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాల యజమానులను మం దలించారు. అక్కడే విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరును, పెట్రోలింగ్ పాయింట్లను, పోలీస్ స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును పరిశీలించి, వారిలో బాధ్యత పెంచేందుకే ఈ ఆకస్మిక పర్యటనలని ఆయన పేర్కొన్నారు.

అపరిచిత లింక్‌లతో జాగ్రత్త

సినిమా పైరసీ సైట్లు, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో డేటా తస్కరణకు గురవుతోందని, అపరిచితన లింక్‌లను క్లిక్ చేయ వద్దని సీపీ సజ్జనార్ సూచించారు. ‘వాటిని క్లిక్ చేస్తే మొబైల్‌లోని ఫోటోలు, కాంటాక్టులు, బ్యాంకింగ్ వివరాలు అన్నీ మాల్వేర్ ద్వారా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఈ డేటాను డార్క్ వెబ్‌లో అమ్ముకుని, దాని ద్వారా ఫేక్ లింకులు, బ్లాక్‌మె యిలింగ్, డిజిటల్ అరెస్టుల పేరుతో వేధింపులకు పాల్ప డతారు’ అని వివరించారు.