17-05-2025 11:33:18 PM
75 బైకులు, 3 ఆటోలు సీజ్...
హుస్నాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్(Cordon search) నిర్వహించి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 75 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు సీజ్ చేశారు. హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్, టీచర్స్ కాలనీలలో ఈ కార్డన్ సెర్చ్ జరిగింది. తనిఖీల అనంతరం ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ ప్రజలకు భద్రతా భావం కల్పించడమే ఈ కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
కాలనీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు, నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. మహిళల రక్షణకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని భరోసా ఇచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నా, మత్తు పదార్థాలు అమ్ముతున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లు, మెసేజ్‌లపై జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ నేరం జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 లేదా 100కు కాల్ చేయాలని, లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు చూపించి వాటిని తిరిగి తీసుకెళ్లవచ్చని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్‌లో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట, కోహెడ ఎస్సైలు విజయభాస్కర్, అభిలాష్, ప్రొబెషనరీ ఎస్సై నవీన్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుల ఈ చర్యతో ప్రజలు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నెలకోసారి నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.