05-11-2025 12:40:49 AM
జహీరాబాద్ టోన్, నవంబర్ 4 : జహీరాబాద్ పరిధిలోని పిండి వంటల తయారీ కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జహీరాబాద్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ కె.వినయ్ కుమార్, ఎస్‌ఐలు రాజేంద్ర రెడ్డి, కె.సంగమేశ్వర్ తమ సిబ్బందితో కలిసి ప్రగతి నగర్ కాలనీ, హమాలి కాలనీ ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో పరస్ కార తయారీ కేంద్రం, అభినయ స్పెషల్ కార తయారీ కేంద్రం వద్ద పరిశీలించగా ఎలాంటి అనుమతులు, నియమాలు, శుభ్రత ప్రమాణాలు పాటించకుండ పనిచేస్తున్నట్లు పోలీసు లు గుర్తించారు.
అదనంగా ఈ కేంద్రాల్లో పాడైన కల్తీ ఆహార పదార్థాలను ఉపయోగించి పిండి వంటలు తయారు చేస్తున్నట్లు కూడా బయటపడింది. ఈ ఉత్పత్తులు జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే పరిస్థితి నెలకొన్నట్లు పోలీసులు తెలిపారు.
దాడి సమయంలో అక్కడి నుండి కల్తీ ఆహార పదార్థాలు, కార తయారీలో ఉపయోగించే ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు దుకాణాల యజ మానులు పరాస్నాథ్, పెరుమాల్ పై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే వినియోగించాలనీ, కల్తీ పదార్థాల తయారీ లేదా విక్రయం గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలనీ పోలీస్‌లు విజ్ఞప్తి చేశారు.