calender_icon.png 14 September, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడుప్పల్‌లో సైబర్ మోసం

14-09-2025 12:12:39 AM

  1. రూ.17,500 పొగొట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి
  2. పాత నాణేలకు రూ.కోట్లు వస్తాయని ఆశ చూపిన నేరగాళ్లు  

మేడిపల్లి, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): సైబర్ మోసాల పట్ల  పోలీసులు ప్రజలకు  అవగాహన కల్పిస్తున్నా మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ గాయత్రీ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు స్థానికంగా ఉండే హరి ప్రసాద్ (36) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతని తండ్రి లక్ష్మణ్ రావు టైలరింగ్ చేస్తాడు.

వీరి వద్ద  పాత నాణేలు ఉన్నాయి. బంధువులు పాత నాణేలకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పడంతో తండ్రీ కొడుకులు నెట్ లో సెర్చ్ చేసి నాణేలకు డబ్బు ఇచ్చే ఒకరిని కాంటాక్ట్ అయ్యారు. వీరి వద్ద ఉన్న నాణేలను ఫొటోలు తీసి వారికి పంపారు. ఆ నాణేలకు రూ.2 కోట్ల 37 లక్షల 25వేలు వస్తాయని తండ్రికొడుకులను నమ్మించాడు. పైగా డబ్బులు ప్యాక్ చేసి పంపిస్తున్న వీడియోను కూడా నేరగాళ్లు చూపించారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టుకి అమౌంట్ వచ్చిందని చెప్పి ఆ డబ్బులకు  జీఎస్‌టీ చెల్లించాలని సైబర్ నేరగాళ్లు బాధితుడి నుంచి 17,500 రూపాయలు  ఆన్ లైన్ ద్వారా అమౌంట్ పంపమన్నారు. దీంతో హరిప్రసాద్ వారికి అడిగిన మొత్తాన్ని పంపించాడు.

వారు ఆమౌంట్ పడగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించి హరిప్రసాద్ మేడిపల్లి సైబర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నామని, సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి తెలిపారు.