calender_icon.png 2 August, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు

30-07-2025 06:21:24 PM

సీఈఐఆర్ టెక్నాలజీతో 13 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత..

హుస్నాబాద్: గత కొన్ని రోజులుగా సిద్దిపేట జిల్లా(Siddipet District) హుస్నాబాద్ డివిజన్ లో పలువురు పోగొట్టుకున్న, దొంగిలించబడిన 13 మొబైల్ ఫోన్లను హుస్నాబాద్ పోలీసులు తిరిగి దొరకబట్టారు. సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) టెక్నాలజీని ఉపయోగించి విజయవంతంగా రికవరీ చేశారు. హుస్నాబాద్ ఏసీపీ సదానందం(ACP Sadanandam) రికవరీ చేసిన ఫోన్లను బుధవారం బాధితులకు అందజేశారు. రికవరీ అయిన ఈ మొబైల్ ఫోన్ల విలువ సుమారు రూ.2.20లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ సదానందం మాట్లాడుతూ, సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా, ఎవరైనా దొంగిలించినా వెంటనే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ లో వివరాలను నమోదు చేయాలని సూచించారు.

సీఈఐఆర్ లో డేటా నమోదు చేయడం ద్వారా ఫోన్‌ను రికవరీ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. సెల్ ఫోన్ పోయిన వెంటనే ఈ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు నమోదు చేస్తే, వీలైనంత తొందరగా ఫోన్ ఎక్కడుందో కనిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి దొరికిన బాధితులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫోన్ దొరికిన బాధితులు తమ బంధువులలో, గ్రామాలలో, స్నేహితులలో ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగినప్పుడు లేదా ఎక్కడైనా పడిపోయినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనే విషయంపై అవగాహన కల్పించాలని ఏసీపీ సదానందం సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, డివిజన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.