30-08-2025 12:00:00 AM
-గంజాయి, గుడుంబా తదితర వాటిపై దృష్టి సారించాలి...
-పోలీస్‌స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
అదిలాబాద్, ఆగస్టు 29 (విజయకాంతి ): గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ఎలాంటి సమాచారాన్నునా క్షణాల వ్యవధిలో తెలుసుకొని శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా, రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సిరికొండ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మొదటగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి పరిశుభ్రతతో పోలీస్ స్టేషన్ నిర్వహణను ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న వాహనాల కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ పోలీసుల పట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా విధులను నిర్వర్తించాలని సూచించారు.