01-11-2025 12:00:00 AM
11 మంది నిందితుల అరెస్ట్
రూ.1.96 కోట్లు నష్టం
బ్యాంకు ఖాతాలో రూ.14.77 లక్షలు ఫ్రీజ్ చేసిన పోలీసులు
రూ.4.52 లక్షల రూపాయలు బాధితులకు అందజేత
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్31( విజయ క్రాంతి): సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలో మోసాలకు ఎగబడు తున్నారు. అమాయకమైన ప్రజలను బురిడీ కొట్టించి బ్యాంకులోని డబ్బులను స్వాహా చేస్తున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లను వేదికగా చేసుకొని లింకులు పంపుతూ మాయమాటలు చెప్పి ప్రజల నుండి డబ్బు ను దోచుకుంటున్నారు. సైబర్ మోసాలు ఎక్కువగా వాట్సాప్, మెసేజ్ యాప్స్ ద్వారా జరుగుతున్నాయి. దీంతోపాటు అపరిచితులు కాల్స్ చేసి బురిడీ కొట్టిస్తున్నారు. మరి కొంతమంది యువతులు వీడియో కాల్ చేసి మాయమాటలు చెప్పుతూ మాయలోకి దింపుతున్నారు.
దాన్ని రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేయడంతో పరువు పోతుందని వారి కి డబ్బులు పంపించిన సంఘటనలు సైతం ఉన్నాయి. మోసపోయిన వారు బయట చెప్పుకోలేక లోలోపల మధనపడుతూ ఉం టున్నారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయకుండా ఉండాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మోసాలు మాత్రం తగ్గడం లేదు.
సైబర్ పై నిఘా!
సైబర్ మోసాలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచారు. డిజిటల్ మోసాలపై ప్రజలలో అప్రమత్తత అవసరమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల బలహీనతే నేరస్తులకు ఆయుధంగా మారుతుందని అప్ర మత్తంగా ఉండాలని కోరుతున్నారు. సైబర్ నేరాలపై ముమ్మరంగా నిఘా కొనసాగుతుంది. సోషల్ మీడియా మోసాలు, ఆర్థిక మోసాలపై, అరాచకంగా వ్యవహరిస్తున్న వారి లిస్టులో హిస్టరీ సీట్లు సిద్ధం చేస్తూ సైబర్ పోలీస్ సహకారంతో అధికార యం త్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
అనుమానితులను నిరంతరంగా చేయడం తో పాటు హిస్టరీ షిట్ల ద్వారా నేరస్తుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్ , మోసపూరిత యాపులపై పోలీసులు నిఘా పెంచారు. మోసాలపై బాధితులకు సత్వర సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. సైబర్ సెల్ ప్రత్యేకత జిల్లాలో పనిచేస్తుంది.
జిల్లాలో సైబర్ భద్రతను పెంపొందించడంతోపాటు క్రమశిక్షణ పై ప్రజల్లో భరోసా పెంచుతున్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి లేదా 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు తిరిగివచ్చే అవకాశాలు ఉంటాయని పోలీసులు తెలుపుతున్నారు.
ఆరు కేసులలో 11 మంది అరెస్ట్
జిల్లా వ్యాప్తంగా 288 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా 33 కేసులు ఎఫ్ ఐ ఆర్ చేశారు. ఇందులో పోలీసులు ఆరు కేసులను చేదించారు. 11 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.జిల్లాలో ఈ ఏడాది 1,96,10476 రూపాయలు సైబర్ మోసగాళ్లు కాజేశారు.14,77,310 రూపాయలను నిందితుల బ్యాంకు ఖాతాల లో ఫ్రీజ్ చేశారు. 4,52,780 రూపాయలను బాధితులకు అప్పగించారు.
అప్రమత్తత అవసరం
సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వ్యాప్తంగా మోసాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎవరైనా మోసానికి గురైతే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. https://www.cyber crime.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయాలి. సైబర్ మోసాల నివారణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిఘా పెంచడం జరిగింది.
కాంతిలాల్ పాటిల్, జిల్లా ఎస్పీ ఆసిఫాబాద్