07-01-2026 12:00:00 AM
కోదాడలో రాజకీయ సమరం
ఆశావాహుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
కోదాడ, జనవరి 6: కోదాడ మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం మళ్లీ తారస్థాయికి చేరింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రక్రియను వేగవంతం చేయడంతో పట్టణం మొత్తం రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ పీక్స్కు చేరింది. కోదాడ పట్టణంలో మొత్తం 35 వార్డులు ఉండగా, తాజా ఓటర్ల జాబితా ప్రకారం 58,601 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 28,069 మంది పురుషులు, 30,520 మంది మహిళలు, 12 మంది ఇతరులుగా ఉన్నారు. ఓటర్ల సంఖ్య పెరగడంతో ఈసారి మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జనవరి 10 వరకు అభ్యంతరాల గడువు..
వార్డు వారీగా రూపొందించిన ఓటర్ల జాబితాను జనవరి 10వ తేదీ వరకు పరిశీలించుకునే అవకాశం కల్పించారు. పేర్లలో పొరపాట్లు, చిరునామా మార్పులు, వేరే వార్డుకు మార్పిడి వంటి అంశాలపై సవరణలకు వెసులుబాటు ఇచ్చారు. దీంతో పట్టణవ్యాప్తంగా ఓటర్లలో అవగాహన పెరిగి కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.
రిజర్వేషన్లే కీలకం..
ఈసారి ఎన్నికల్లో అసలు రాజకీయ సమీకరణలన్నీ రిజర్వేషన్ల చుట్టూనే తిరుగుతున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఏ వర్గానికి కేటాయించబడుతుందన్న అంశం పై పట్టణ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. రిజర్వేషన్ ప్రకటన వెలువడిన తర్వాతే పార్టీల వ్యూహాలు పూర్తిగా బయటపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్లో ఆశల హడావుడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కోదాడలో కాంగ్రెస్ ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన నాయకులకు అవకాశాలు దక్కుతాయా..? లేక ఎన్నికల వేళ యాక్టివ్గా మారే నేతలకే టికెట్లు కేటాయిస్తారా..? అన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ హాట్గా సాగుతోంది.
పార్టీల కదలికలు..
రాజకీయ పార్టీలు కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక, వార్డు వారీగా సమీకరణలు మార్చుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా గట్టిపోరుకు సిద్ధమవుతున్నారు.
రిజర్వేషన్ వెలువడితేనే స్పష్టత..
మొత్తానికి కోదాడ మున్సిపాలిటీలో రిజర్వేషన్ ప్రకటన వెలువడిన వెంటనే అసలు రాజకీయ చిత్రం స్పష్టమవనుంది. కోదాడ మున్సిపల్ పీఠం ఎవరి ఖాతాలో పడనుంది..? అన్న ప్రశ్నకు సమాధానం కోసం పట్టణమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.