15-10-2025 03:00:03 PM
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా పెద్ద కుట్ర జరుగుతోందని మాల మహానాడు అండ్ రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ, బీజేపీ, ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యత పై రాజకీయ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశారు ప్రధాని మోడీ. దేశంలో అందరికన్నా ముందుగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం చేయడం, దాన్ని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఫాలో అవ్వడం, దేనికి నిదర్శనం అని ఆయన ప్రశ్నించారు.రాహుల్ గాంధీకి ఇదంతా తెలిసే జరుగుతుందా అని ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అని డప్పు కొట్టుకునే రేవంత్ రెడ్డి, ఈ యొక్క సామాజిక న్యాయం ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసే కేవలం ఎంగిలి మెతుకుల్లోనేనా అనే ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపద, ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు, దేశ పరిశ్రమలు, జడ్జెస్ నియామకాలు, పరిశ్రమల్లో అక్కర్లేదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల వందలో కేవలం నలుగురికే బెనిఫిట్ జరుగుతుందని అన్నారు. వందలో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారో మోడీ చెప్పాలన్నారు.అలాగే ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా, ఇక చేసేదేముందని అనుకోకండి, ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తుంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం వెనుక మతలబు ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.చెంచాగిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు బెనిఫిట్ పొందిన మాల ఉద్యోగుల కూడా మాల జాతిని తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కళ్ళు తెరిచి మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు ఎదుర్కొని గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఎదుర్కొంటుందని, శాంతియుత పోరాటానికి సిద్ధమయ్యే సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.