calender_icon.png 31 January, 2026 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఖరి రోజు.. నామినేషన్ల జోరు

31-01-2026 12:00:00 AM

అభ్యర్థులను ఖరారు చేయని రాజకీయ పార్టీలు 

అయోమయంలో ఆశావాహులు 

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 30, (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుండడంతో అభ్యర్థులు, ఆశావాహులో భారీగా నామినేషన్లు సమర్పించారు. జిల్లావ్యాప్తంగా రెండు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లు, ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులు, నూతనంగా ఏర్పాటైన అశ్వరావుపేట మున్సిపాలిటీలోని 22 వార్డులకు శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి.

పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించిన ఆశావాహులతో పాటు, మరి కొంతమంది అభ్యర్థులు ఎవరికివారుగా మద్దతు దారులతో ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్ కేంద్రాలకు వచ్చి నామినేషన్లను సమర్పించారు. దీంతో కొత్తగూడెం ,పాల్వంచ, అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపల్ కార్యాలయాల్లో సందడి నెలకొంది. భారీ సంఖ్యలో జనాభా రావడంతో ప్రతి కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

అభ్యర్థులను ఖరారు చేయని రాజకీయ పార్టీలు 

మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, భారతీయ జనతా పార్టీ , తెలుగుదేశం, జనసేన, స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఆశావాహులు అయోమయంలో పడ్డారు. ఒకవైపు పొత్తులపై తర్జనభర్జన జరుగుతున్న నేపథ్యంలో సీటు ఖరారు అవుతుందా లేదా అనే మీమాంసం లో ఒక్కొక్క అభ్యర్థి రెండు, మూడు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రీతిలో పొత్తులు కుదిరినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో సిపిఐ, తెలుగుదేశం పార్టీలు కూటమిగా ఏర్పడ్డారు.

అధికార కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీలు మరోకూటముగా బరిలో నిలిచారు. బీఆర్‌ఎస్, బిజెపి, జనసేన, స్వతంత్ర అభ్యర్థులు ఒంటరి పోరులో నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు లేనందున మిత్రపక్షమైన పార్టీ గుర్తుపైనే పోటీ చేయాల్సి ఉంటుంది. అశ్వరావుపేట మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకున్నాయి, కాంగ్రెస్ సిపిఎం పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఇలా ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రీతిలో పొత్తుల కుదరటంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఏ అభ్యర్థి ఏ పార్టీ నుంచి బరిలో ఉండే విషయం స్పష్టమవుతుందని తెలుస్తోంది. రాజకీయ నాయకులు మాత్రం ఇప్పటివరకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఖరారు పై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.