calender_icon.png 31 January, 2026 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజిత్ పవార్ భార్యకు పదోన్నతి

31-01-2026 01:42:41 AM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎంపీ సునేత్రా పవార్

నేడు ప్రమాణ స్వీకారం

మహాయుతి కూటమి నిర్ణయం

ముంబై, జనవరి 30 : మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మర ణం పాలైన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్యకు కీలక బాధ్యతలు అప్పగించాలని మహాయుతి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అజిత్ పవార్ వారసులిగా ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంగా భార్య సునేత్రా పవార్‌కు అవకాశం కల్పించాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె రేపు మహారాష్ట్ర కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.  ప్రస్తు తం మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్న సునేత్రా పవార్‌కు ప్రమో షన్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని సర్కార్ నిర్ణయించింది.

దీంతో శనివారం  సాయంత్రం 5 గంటలకు సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పగ్గాలు స్వీకరించేందుకు ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఎక్సైజ్, క్రీడా మంత్రిత్వ శాఖల్ని ఆమె నిర్వహించనున్నారు. అయితే మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తాత్కాలికంగా పవార్ నిర్వహించిన ఆర్థిక శాఖను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన వద్దనే ఉంచుకున్నారు.

బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ శాఖను ఎన్సీపికి ఇస్తారు.  కాగా, శుక్ర వారం ఉదయం ఎన్సీపీ సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజ్బల్ కలిసి సీఎం ఫడ్నవీస్ నివాసానికి వెళ్లారు. అజిత్ పవార్ నిర్వహించిన కీలకమైన ఆర్థిక, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖలతో సహా అన్ని మంత్రిత్వ శాఖలు ఎన్సీపీ కోటాలోనే కొనసాగాలని కోరారు. ఈ మేరకు ఒక లేఖను సమర్పించారు.  

ఒక్కటికానున్న ఎన్సీపీ గ్రూపులు !

డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకస్మిక మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం వేరుగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో రెండు గ్రూపులు కలిసిపోవాలని తీసుకున్న నిర్ణయం తీసుకున్నాయి. గతంలో 2023లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చి బీజేపీ -శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అజిత్ పవార్ .. గతేడాది జరిగిన ఎన్నికల్లోనూ చీలిక వర్గంతోనే ఎన్నికలకు వెళ్లి గెలిచారు. అయితే, ఆయన తాజాగా బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడానికి ముందే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తన బాబాయ్ శరద్ పవార్‌తో విలీనం కోసం మంతనాలు జరపడం వంటి కారణాలతో ఇప్పుడు పార్టీలో రెండు గ్రూపులు కలిసిపోయేందుకు మార్గం సుగమమైంది.  

త్వరలోనే విలీన ప్రక్రియ

అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన భార్య సునేత్రా పవార్ ను పరామర్శించేందుకు వచ్చిన ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నేతలు విలీనానికి ప్రతిపాదించడం, ఆమె కూడా ఓకే చెప్పేయ డంతో త్వరలోనే విలీన ప్రక్రియను ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో వచ్చే నెలలో స్ధానిక సంస్ధల ఎన్నికలు ముగిశాక రెండు గ్రూపులు విలీనం చేసుకోవాలని నిర్ణయించాయి. అలాగే ఎన్సీపీకి అధినేతగా ఎవరుండాలనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అజిత్ భార్య సునేత్రా పవార్‌తోపాటు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో వీరిలో ఒకరికి పగ్గాలు అప్పగించబోతున్నారు.