25-10-2025 12:50:20 AM
చర్యల్లో రెవెన్యూ అధికారుల అలసత్వం
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 24, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో పి ఓ టి ఆక్రమణలు మామూలే కదా అంటూ రెవెన్యూ అధికారులు సమాధానం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పిఓటి చట్టం అతిక్రమణ పై చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ అధికారులు అలసత్వం వ్యవహరిస్తున్నట్లు తేటతెల్లమవుతుంది.
భూమిలేని గిరిజనులకు సాగు నిమిత్తం ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ పట్టా ద్వారా హక్కు కల్పిస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎస్త్స్రన్మెంట్ పట్టాను పొందిన గిరిజనులు వంశపారాంపరంగా అనుభవించే హక్కు మాత్రమే ఉంటుంది. అసైన్మెంట్ పట్టాను బదలాయించాలంటే గిరిజనుల నుండి గిరిజనులకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ఏ కారణం చేతనైనా అసైన్మెంట్ పట్టాలు గిరిజనులకు బదులు గిరిజనేతరులు కొనుగోలు చేసిన అది పి ఓ టి చట్టం ప్రకారం అతిక్రమణ అవుతుంది. గిరిజనేతరులకు హక్కు కల్పించిన రెవెన్యూ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటూ, అసైన్మెంట్ పట్టా కలిగిన భూమిని ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.
కొంతమంది రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి చట్టాన్ని అతిక్రమిస్తూ నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా పాల్వంచ మండల పరిధిలోని సోమలగూడెం రెవెన్యూ గ్రామంలో 61/2/అ సర్వే నెంబర్లు సామ్య అనే గిరిజనుడికి మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎస్త్స్రన్మెంట్ పట్టా ద్వారా హక్కు కల్పించారు. అట్టి భూమిని కొంతకాలం క్రితం బోధ రాంబాబు అనే గిరిజనేతరుడు కొనుగోలు చేశారు.
ఇది గిరిజన చట్టానికి విరుద్ధం. తగదునమ్మ అంటూ రెవెన్యూ అధికారులు రాంబాబు పేరును అనుభవదారి కాలంలో నమోదు చేయటం గమనార్హం. అంతటితో ఆగకుండా రాంబాబు తాజాగా మరో గిరిజనేతరులకు అట్టి భూమిని విక్రయించడం జరిగింది. ఇది ముమ్మాటికి పిఓటి చట్ట అతిక్రమణ. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు అంగీకరించినప్పటికీ చర్యలకు మాత్రం ఉపక్రమించడం లేదు.
అసైన్మెంట్ పట్టాను రద్దుచేసి అట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవలసి ఉంటుంది. విషయం వెలుగు చూసినప్పటికీ రెవెన్యూ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకొనే దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా కొనుగోలు చేసిన ప్రబుద్ధులు అట్టి భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తక్షణమే పి ఓ టి చట్టం అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటూ, గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏ విషయమై తాసిల్దార్ ధారా ప్రసాదం వివరణ కోరగా పిఓపి వాయులేషన్ అయిన మాట వాస్తవమని, తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని, పట్టేదారు ఫిర్యాదు చేస్తే ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసి అట్టి భూమిని గిరిజనుడైన పట్టేదారుకు అప్పగించడం జరుగుతుందన్నారు.