13-05-2025 12:07:51 AM
సంగారెడ్డి, మే 12(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి అని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, డిఆర్‌ఓ పద్మజారాణి, ఇతర అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలనుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూప్రజావాణిలో మొత్తం 73 దరఖాస్తులు వచ్చాయని, ఈ వినతులను సంబంధిత శాఖ అధికారులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి...
ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా అధికారులు కలెక్టరేట్ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కచ్చితంగా అనుసరించాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే అధికారులు సమయపాలన పాటిస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. బయోమెట్రిక్ హాజరు కోసం ఇంకా రిజిస్టర్ చేసుకొని అధికారులు ఎవరైనా ఉంటే త్వరగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. బయోమెట్రిక్ హాజరు అనుసరించకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు.