calender_icon.png 25 November, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

11-02-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు 

సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల  ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమావేశంలో పలు సూచనలు చేశారు. జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు సిద్ధంగా ఉండాలని, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 

పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలన్నారు. గ్రామ పంచాయతీ , జెడ్పిటిసి, ఎంపిటిసి, ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు.

పోలింగ్ బూత్‌లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌ఓలకు, ఏ ఆర్‌ఓలకు, పిఓలకు, ఏపిఓలకు  మాస్టర్ ట్రైనీలచే శిక్షణ ఇవ్వడం జరుకుతున్నదని, శిక్షణలో నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా ఎన్నికల నిర్వహించాలన్నారు.  ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.

ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్.ఓలు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ రోజు నుండే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని, నోటిఫికేషన్‌లో స్పష్టంగా వివరాల ను పొందుపర్చాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. 

బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని, ఓటరు జాబితాలోని పేరును అక్షరక్రమం కోసం పరిగణలోకి తీసుకుంటే ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉండదని తెలిపారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటీ అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని అన్నారు.

11న  ఆర్‌ఓలకు, ఏఆర్‌ఓలకు  జహీరాబాద్ , నారాయణఖేడ్ , సంగారెడ్డి డివిజన్లలోనూ, 12,13 తేదీలలో పిఓలకు, ఏపిఓలకు ఆయా మండల ప్రధాన కార్యాలయాల లోను , 15 తేదీన ఎంపిటిసి ,జెడ్ పిటిసి ఎన్నికల నిర్వహణ కోసం  శిక్షణ  ఉంటుందన్నారు .

ఈ సమీక్ష సమావేశం లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) మాధురి , ట్రైనీ కల్లెక్టర్ మనోజ్ , జడ్పీ సీఈఓ జానకిరెడ్డి , డిపిఓ  సాయిబాబా , ఎన్నికల నోడల్ అధికారులు, రెవెన్యూ డివిజినల్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు , మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.