20-07-2025 12:41:26 AM
తెలుగు యూనివర్సిటీలో అందజేసిన మంత్రి వివేక్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 19 (విజయక్రాంతి): సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వార్షికోత్సవాల సందర్భంగా 2024 సంవత్సరానికి గానూ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవాన్ని శనివా రం నిర్వహించారు. కళ, సాహిత్యం, విద్యా రంగాల్లో విశిష్ఠ సేవలందించిన 12 మంది ప్రముఖులను ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఘనంగా సన్మానించింది.
కార్మిక, ఉపాధి, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజ రై, 12 మందికి పురస్కారాలు ప్రదానం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృతి, భాష, కళలను ప్రోత్సహించే విధంగా తెలుగు విశ్వవిద్యాలయం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమ న్నారు.
చిత్రలేఖన విభాగానికి చెందిన లక్కరాజు నరేందర్ రూపొందించిన తెలుగు విశ్వవిద్యాలయం అధికార లోగోను మంత్రి ఆవిష్కరించారు. వారి సృజనాత్మకతకు గు ర్తింపుగా విశ్వవిద్యాలయం తరఫున రూ. 20,116 నగదు బహుమతిని అందజేశారు. నరేందర్ మాట్లాడుతూ..
తాను స్థాపించిన ‘Finishing Pointe’ సంస్థ ద్వారా గత 35 సంవత్సరాలుగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లోగోలు రూపకల్పన చేశానని, వాటిలో చాలావరకు సమాజంలో విశ్వసనీయతను సంపాదించాయని గర్వం గా భావిస్తున్నానని తెలిపారు. తాను పొందిన రూ.20,116 నగదు బహుమతిని నాటక రంగ ప్రతినిధి దుప్పల శ్రీరాములుకు వినయపూర్వకంగా అందజేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, అధ్యాపకులు పాల్గొన్నారు.