21-12-2025 12:33:50 AM
నా కష్టకాలంలో బ్రహ్మకుమారీస్ సంస్థే ధైర్యాన్నిచ్చింది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
గచ్చిబౌలి శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవంలో రాష్ట్రపతి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (విజయక్రాంతి):‘ప్రస్తుత సమాజంలో కేవ లం భౌతిక అభివృద్ధి వల్ల జీవితంలో సుఖశాంతులు లభించవు. మనిషికి ఆధ్యాత్మికత, అంతర్గత స్థిరత్వం ఎంతో అవసరం. కల్లోలం లో కూడా నిశ్చలంగా ఉండటం అనే సిద్ధాంతాన్ని అలవర్చుకోవాలి అని భారత రాష్ట్రప తి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు.శనివారం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ సంస్థకు చెందిన శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మొక్కలు నాటా రు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి ప్రపంచం మానసిక ఒత్తిళ్లు, సా మాజిక సంఘర్షణలు, పర్యావరణ అసమతుల్యత వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు.వీటికి పరిష్కారం భారతీయ సనాతన జ్ఞానంలోనే ఉందన్నారు. సత్యం, న్యాయం, కరుణ, ప్రకృతితో మమేకమవ్వడం వంటి విలువలు నేటికీ ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు. ‘యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం కాదు.. అదొక జీవన విధానం. ఇది మానసిక సమతుల్యతను, ఆత్మ నిగ్రహాన్ని పెంపొందిస్తుంది అని తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వసుధైక కుటుంబకం అనే భావనతో ముందుకెళ్లాలని సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి తన వ్యక్తిగత జీవితాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. నా జీవితంలోని కష్టకాలంలో బ్రహ్మకుమారీస్ సంస్థ నాకు ఎంతగానో అండగా నిలిచింది. కష్టాల్లో కుంగిపోకుండా, నిశ్చలంగా ఉండటాన్ని నేను ఇక్కడి నుంచే నేర్చుకున్నాను అని చెప్పారు. పరమాత్ముడు కూడా మాతృశక్తిని దుర్గ, కాళి, సరస్వతి, లక్ష్మి రూపాలలో ఎంచుకున్నారని, మహిళల నాయకత్వంలో ఈ సంస్థ నడుస్తుండటం గర్వించదగ్గ విషయమని కొనియాడారు.రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.