12-07-2025 12:11:13 AM
ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేయండి
2022లో రూ. 244.27 కోట్లు ప్రకటనలకు ఖర్చు
తెలంగాణ అభివృద్ధి పథకాలపై దేశమంతటా ప్రకటన
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): అసంపూర్తిగా ఉన్న పాలమూరు ప్రాజెక్టును రూ. 22.13 కోట్ల ఖర్చుతో ప్రారంభోత్సవం చేయడం ప్రజాధనాన్ని వ్యర్థం చేయడమేనని,ఇది అధికార దుర్వినియోగమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్ జీజీ) అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి లేఖ రాశారు.
ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లబ్ధిపొందేందుకు చేసిన పనిగా అగుపిస్తుందన్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో నూ సమర్థనీయం కాదని, విచారణ జరిపి పజాధనాన్ని ఎన్నికల్లో లబ్ధికోసం వాడిన దోషులపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. గవర్నర్‌కు ఎఫ్‌జీజీ రాసిన లేఖలో పేర్కొన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
70 శాతమే పూర్తి..
దక్షిణ తెలంగాణ జిల్లాకు సాగు, తాగునీటి కోసం నిర్మించ తలపెట్టిన పాలమూరు ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి ప్రభుత్వం 2015 జూన్‌లో రూ. 32,000 కోట్లతో పాలనాపరమైన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనిని 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని (జూన్ 2019 నాటికి) అందులో పేర్కొన్నారు.
అయితే కృష్ణానది నుంచి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నీటికంటే ఎక్కువగా పాలమూరు ప్రాజెక్టు ద్వారా తీసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకో ర్టులో కేసు వేసింది. దీనితోపాటు ప్రాజెక్టు కోసం భూసేకరణకు సరైన పరిహారం ఇవ్వలేదని చాలా మంది ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. వివిధ రకాల కోర్టు కేసులు, ఇతర సమస్యలతో పాలమూరు ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపో తుందా అనే సంధిగ్ధంలో ఉంది. 2023 నవంబరు నాటికి ప్రాజెక్టుపై రూ. 30 వేల కోట్లను ఖర్చుచేసి 70 శాతం పనులు పూర్తి చేశారు.
ఒకే ఏడాది రూ. 244.17 కోట్ల ఖర్చు..
రకరకాల సమస్యలతో పూర్తికాని ప్రాజెక్టుకు రూ. 22.13 కోట్ల ఖర్చుతో ప్రారంభో త్సవం చేయడం ప్రజాధాన్ని వ్యర్థం చేయడమంటే అధికార దుర్వినియోగమనేని ఆ లేఖలో తెలిపారు. అలాగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లబ్ధి పొందేందుకే ఇలా చేశారని అనిపిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం 2023 సంవత్సరంలోకూడా పెద్దఎత్తున జరిగిందని వారు విన్నవించారు.
2022లో రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ .. జాతీయ పార్టీగా మారింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలలో గుర్తింపు కోసం తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సంక్షేమ పథకాల పేరుతో దేశంలోని అన్ని పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. ఇందుకోసం కేవలం ఒక సంవత్సరంలో రూ. 244.17 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసినట్టు గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
తెలుగు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, మరాఠి, ఒరియా, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ.. ఇలా దేశంలోని అన్ని చిన్నా, చితకా పత్రికలలోకూడా ప్రకటనలు ఇచ్చినట్టు ఆ లేఖలో తెలిపారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి, ప్రజాధనాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వాడిన దోషులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్‌ను పద్మనాభరెడ్డి కోరారు.
ప్రకటనలకు రూ. 22.13 కోట్లు..
అయితే ప్రాజెక్టు సమస్యలతో సతమతమవుతుంటే అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ప్రాజెక్టును వరుసగా రెండు రోజుల్లో రెండుసార్లు ప్రారంభించారు. దీనికోసం పెద్దఎత్తున పత్రికల్లో ప్రకటను ఇచ్చారు. ఇందుకోసం రూ. 22.13 కోట్లను ఖర్చు చేశారు. 16.9.2023 నాడు నార్లాపూర్‌లో ప్రాజెక్టును ప్రారంభించారు. తెల్లవారి 17.9.2023 నాడు అదే ప్రాజెక్టుకు ప్రారంభోత్సవాన్ని కొల్లాపూర్‌కూడా చేశారు.
ఈ ప్రారంభోత్సవానికి పెద్దఎత్తున ప్రతికల్లో ప్రకటనలు ఇచ్చారు. 13 తెలుగు, 7 ఇంగ్లీషు, 3 హిందీ, 6 ఉర్దూ, 2 మరాఠీ పత్రికలకు, అలాగే 296 ఇతర చిన్నా, చితక పత్రికలు, 322 మ్యాగజైన్ల కోసం రూ. 22,13,55,038 ఖర్చు చేశారని గవర్నర్‌కు రాసిన లేఖలో ఎఫ్‌జీజీ స్పష్టంగా పేర్కొంది.