calender_icon.png 31 January, 2026 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాల నివారణ

31-01-2026 12:00:00 AM

పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ 

సిద్దిపేట క్రైం, జనవరి 30 : రోడ్డు ప్రమాదాల నివారణకు జరిమానాలు  పరిష్కారం కాదని, ప్రతి ఒక్కరిలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పట్ల అవగాహన ఉండాలని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ’అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ శాఖ నిర్వహించిన సోషల్ మీడియా వీడియోల పోటీ విజేతలను శుక్రవారం ప్రకటించారు.

కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు, పోటీలో పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. పోటీలో ప్రథమ స్థానం పొందిన మన సిద్దిపేట అడ్డా ఇన్స్టాగ్రామ్ పేజ్, రెండో స్థానంలో నిలిచిన ఫ్లాష్ ఫ్రేమ్35 నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతకాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఒక సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చన్నారు.

ముఖ్యంగా రోడ్డు భద్రతా నియమాలపై యువతను చైతన్యపరచడంలో ఈ వీడియోలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు యువత మరింత ఉత్సాహంగా ముందుకు రావాలని కమిషనర్ కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మద్యపాన వ్యసనం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాలు, సమాజానికి పోలీస్ సేవలు వంటి అంశాలపై వినూత్నమైన వీడియోలు రూపొందించి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, ఉపేందర్, శ్రీధర్ గౌడ్, లక్ష్మీ బాబు, సబ్ ఇన్స్పెక్టర్ దామోదర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సాయిప్రసాద్, సాయిచరణ్ పాల్గొన్నారు.