calender_icon.png 21 November, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా ప్రాంగణాల ప్రైవేటీకరణ

21-11-2025 12:00:00 AM

  1. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ పచ్చజెండా
  2. సమావేశంలో 24 అంశాలకు ఆమోదం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ నగర అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో 18 ఎజెండా అంశాలతో పాటు, అదనంగా ప్రవేశపెట్టిన 6 టేబుల్ ఐటమ్స్‌తో సహా మొత్తం 24 ప్రతిపాదనలకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయాలలో క్రీడా ప్రాంగణాల ప్రైవేటీకరణ, మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణం, పలు ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ వంటివి ఉన్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, నిర్వహణ భారాన్ని తగ్గించుకునే లక్ష్యంతో, నగరంలోని క్రీడా ప్రాంగ ణాలను ప్రైవేటుపరం చేయాలన్న ప్రతిపాదనకు స్టాండింగ్ కమిటీ పచ్చజెండా ఊపింది. శేరిలింగంపల్లిలోని ఖాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్సును ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించారు.

ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు స్టాండింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చార్మినార్ సమీపంలోని ఖిల్వత్ వద్ద, పర్యాటకుల వాహనాల రద్దీని తగ్గించేందుకు ’డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్’  పద్ధతిలో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కమిటీ ఆమోదం తెలిపింది. ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణకు ఆమోదం తెలిపింది.

వీటితోపాటు కేపీహెచ్బీ కాలనీలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో రూ.5 కోట్లతో ప్రాథమిక ఆహార పరీక్షా ప్రయోగశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.  2025 ఆర్థిక సంవత్సరానికి ‘వన్ టైమ్ స్కీమ్ ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ  కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపేందుకు కమిషనర్ తీసుకున్న చర్యను కమిటీ ఆమోదించింది.

బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన

నగరంలోని సమస్యలను పరిష్కరించడంలో, నిధుల కేటాయింపులో పాలకవర్గం విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్, ఆకుల శ్రీవాణి, మహేందర్, లాల్ సింగ్ నేతృత్వంలో ఆందోళనకు దిగారు. ఏడో అంతస్తులోని స్టాండింగ్ కమిటీ హాల్ ముందు బైఠాయించి, మేయర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నగరంలో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలపై మేము ఇచ్చిన వినతిపత్రాలకు సమాధానం చెప్పాలని కోరారు. అధికార పార్టీ, స్టాండింగ్ కమిటీ సభ్యుల డివిజన్లకే కాకుండా, అన్ని డివిజన్లకూ సమానంగా నిధులు కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ నెల 25న జరగనున్న కౌన్సిల్ సమావేశానికి హెచ్‌ఎండీఏ, కలెక్టరేట్ అధికారులను పిలిచి సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.