05-11-2025 12:33:17 AM
-మోతె రైతు ఉత్పత్తి దారుల సంఘంలో అంతా గందరగోళం
-అర్థరహితంగా అధ్యక్షుడి తొలగింపు
-నూతన అధ్యక్షుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణలు
-అకౌంట్‌లో జమ అయిన నగదు లెక్కలు చూపాలంటూ ఆందోళన
-ఒకే కుటుంబంలో ముగ్గురు కీలకమంటూ విమర్శలు
-ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటున్న పలువురు డైరెక్టర్లు, రైతులు
మోతె, నవంబర్ 4 : రైతుల సమిష్టి బలాన్ని పెంచి, వారి ఆదాయాన్ని మెరుగుపరచడం. రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర పొందడం, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచుకోవడం, తక్కువ ఖర్చుతో విత్తనాలు, ఎరువులు వంటివి కొనడం, మరియు ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడమే లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, అందులో సభ్యులుగా ఉన్న రైతుల స్వార్థపూరిత ఆలోచనల వలన రైతు ఉత్పత్తి దారుల సంఘాల సింగం భంగంగా మారుతున్నాయి. ఇటువంటి ఘటనే జిల్లాలోని మోతే మండల కేంద్రంలో జరిగింది. ఇక్కడ సుమారు రూ.5 లక్షల మేర అవినీతి జరిగిందంటూ పలువురు డైరెక్టర్ లు ఆరోపిస్తున్నారు.
ఏర్పాటు ఇలా..
రైతు ఉత్పత్తిదారుల సంఘాల నిబంధనలకు అనుగుణంగా మోతె మండల కేంద్రానికి చెందిన 300 రైతులు కలిసి ఒక కమీటిగా ఏర్పడి అందులో 10 మందితో బాడీని ఏర్పాటు చేశారు. అయితే అందులో ఒక్కొక్కరు రూ. 4వేల చొప్పున వేసి ఫిబ్రవరి 2, 2023న రిజిస్ట్రేషన్ చేశారు. తదుపరి అధ్యక్షుడు బోళ్ళ మధుసూదన్ రెడ్డి, కోశాధికారిగా దోసపాటి రాములు పేర్లపై స్థానిక ఏపీజీబీ బ్యాంకులో జాయింట్ అకౌంట్ తీశారు. బాడీలోని సభ్యుల నుండి వసూలు చేసిన నగదును అందులో జమచేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం నుండి రూ.3.5 లక్షలు మంజూరి అయ్యాయి.
కథ అడ్డం తిరిగేది అలా..
కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 3.5 లక్షలు మంజూరు కాగానే అప్పటివరకు ఉపాధ్యక్షుడిగా ఉన్న బొక్క ఉపేందర్ రెడ్డి తనకున్న మంది, మార్భలంతో అప్పటివరకు అధ్యక్షుడిగా బోళ్ళ మధుసూదన్ రెడ్డిని అర్థరహితంగా తొలగించి ఆయనే అధ్యక్షుడి అవతారమెత్తినట్లు విశ్వసినీయంగా తెలిసింది. తరువాత బాడీలో ఉన్నటువంటి సభ్యులను కూడా తొలగించి తన వాళ్ళు, అనుచరులను చేర్చుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. నాటి నుండి తన ఇష్టానుసారంగా వ్యవహరించాడనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రూ.15 లక్షలు జమ అయినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ జమైనటువంటి నగదుకు సంబంధించినటువంటి విషయాలు ఏవీ బయటకు తెలియనియడం లేదని పలువురు డైరెక్టర్లు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
సంఘం ముందే ఆందోళన..
రైతు ఉత్పత్తిదారుల సంఘం అకౌంట్లో జమ అయిన డబ్బులకు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరుతూ గత వారం రోజుల క్రితం కొంతమంది డైరెక్టర్ లు రైతులతో కలిసి సంఘం ముందు కూర్చొని రెండు గంటలపాటు ఆందోళనకు దిగారు.
పోలీసుల ప్రవేశంపై అలుముకున్న అనుమానాలు!..
రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎటువంటి ఆందోళన చేపట్టొద్దని ఏదైనా ఉంటే ఫిర్యాదు చేసుకోవాలని ఆదేశించారు. అయితే పోలీసుల రంగ ప్రవేశ వెనకాల ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న బొక్క ఉపేందర్ రెడ్డి పాత్ర ఉందని, అతని ఒత్తిడి మూలంగానే పోలీసులు వెంటనే వచ్చి ఆందోళనను అడ్డుకున్నారని పలువురు డైరెక్టర్లు, రైతులు అందరి ముందే చెబుతుండడం గమనార్హం.
లెక్కలు తేల్చాల్సిందేనంటూ హుకుం..
రైతు ఉత్పత్తిదారుల సంఘంలో అనేక అవకతవకలు జరిగాయని అందులో జరిగిన జమ, ఖర్చులకు సంబంధించిన లెక్కలు ఖచ్చితంగా తెలియాల్సిందేనంటూ పలువురు డైరెక్టర్లు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు కలగజేసుకోవడం లేదంటే వారు కూడా ఇందులో భాగస్వాములు అయ్యే అవకాశాలు ఉన్నాయనీ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ని కలిసి పిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఒకే కుటుంబంలోని ముగ్గురు కీలకమే!..
ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న బొక్క ఉపేందర్ రెడ్డి కుటుంబంలోని ముగ్గురు సభ్యులు కీలక పదవుల్లో కొనసాగుతున్నట్లు కొందరు డైరెక్టర్‌లు ఆరోపిస్తున్నారు. ఆయన అధ్యక్షుడితో పాటు అకౌంటెంట్‌గా, భార్య డైరెక్టర్‌గా, కూతురు సీఈఓగా కొనసాగుతిన్నారని చెబుతున్నారు. అలాగే ఆయన అకౌంటెంట్‌గా, కూతురు సీఈఓగా ఇద్దరు ప్రతి నెల జీతాలు కూడా తీసుకుంటున్నట్లు కొందరు డైరెక్టర్ లే నేరుగా చెబుతుండటం గమనించదగిన విషయం. రైతు ఉత్పత్తిదారుల సంఘం పేరిట జరుగుతున్న అవినీతిని బయటకి తీసి ఇటువంటి సంఘటన మరి ఎక్కడ జరగకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు చూడాలని పలువురు కోరుతున్నారు.
తీర్మానాలు లేకుండానే పనులు చేస్తుండు
రైతు ఉత్పత్తి దారుల సంఘంలో ఎటువంటి తీర్మానాలు లేకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుండు. ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. అకౌంట్ లో ఉన్న రూ.15 లక్షలలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఖర్చు చేశారని విషయం ఎవరికీ తెలియడం లేదు.
- దోసపాటి రాములు, డైరెక్టర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం మోతె
లెక్కలు చూద్దామంటే దాటవేస్తుండు
కేంద్ర ప్రభుత్వం నుండి మూడున్నర లక్షల రూపాయలు వచ్చిననాటి నుంచి లెక్కలు చూసుకుందాం అని ఎన్నిసార్లు అడిగినా రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని దాటవేస్తుండు. ఇదే విషయమై గట్టిగా అడిగినందుకు నాపై కేసు కూడా పెట్టాడు.
- అండెం నారాయణ, డైరెక్టర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం, మోతె
నిధుల మంజూరి నిలిపేశాం
మోతెలోని రైతు ఉత్పత్తిదారుల సంఘంపై పలు ఆరోపణలు రాగా వెంటనే నిధుల మంజూరిని నిలిపివేశాం. ఇదే విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాం. త్వరలో సంఘంను ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు.
- శ్రీనివాస్, ఎఫ్ పీఓ, కోదాడ.