05-11-2025 12:48:22 AM
నిజామాబాద్, నవంబర్ 4 (విజయ క్రాంతి): అది నిజామాబాద్ నగరంలోని మూడవ కల్లు డిపో. కానీ, ఆ డిపోకు కల్లు ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ఏకంగా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలోని ఈత చెట్ల నుంచి! వినడానికి ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా ఉన్నా... ఇది అక్షరాలా ఆ డిపో లైసెన్స్ కోసం ఎక్సైజ్ అధికారులకు చూపించిన లెక్క. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా, సంగారెడ్డిలో ఎక్కడో ఈత వనం ఉందని కాగితాలు చూపిస్తే, ఇక్కడి ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం నిజనిర్ధారణ చేసుకోకుండా లైసెన్స్ రెన్యువల్ చేస్తూ పోవడం ఇక్కడ జరుగుతున్న అక్రమాల దందాకు అద్దం పడుతోంది.
సంగారెడ్డిలో కల్లు ఎప్పుడు గీస్తున్నారు? ఎవరు గీస్తున్నారు? ఆ కల్లు వందల కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్కు ఎప్పుడు చేరుతోంది? ఇక్కడ ఎప్పుడు అమ్ముతున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం ఆ భగవంతుడికైనా తెలియాలి గానీ, బాధ్యతాయుతమైన ఎక్సైజ్ అధికారులకు మాత్రం తెలియకపోవడం విడ్డూరం. ఈ ఒక్క ఉదాహరణ చాలు... మూడవ కల్లు డిపో నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా, అక్రమాలకు కేరాఫ్గా మారిందో చెప్పడానికి. ఇక్కడ తవ్వినకొద్దీ అక్రమాల పుట్ట పగులుతోంది.
పదేళ్ల ఆడిట్... అంతా దొంగ లెక్కలే..
ఈ సహకార సొసైటీకి గడిచిన పదేళ్లుగా ఆడిట్ నిర్వహణే ఒక పెద్ద ప్రహసనం. లెక్కలన్నీ తప్పుల తడకలని, అన్నీ దొంగ లెక్కలేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా, ఆ లెక్కలు మాత్రం సొసైటీ సభ్యులకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉన్నాయి. అసలు డిపో ఏర్పాటులోనే దొంగ పేర్లు, నాన్-లోకల్ వ్యక్తులతో తతంగం నడిపించారని, ఇప్పుడు అదే అక్రమ పునాదులపై ఏటా లైసెన్స్ రెన్యువల్, దొంగ ఆడిట్ లెక్కలు చూసీచూడనట్టుగా అధికారులు వదిలేస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఒకే కుటుంబం... కార్పొరేట్ దోపిడీ..
సహకార సొసైటీ పేరుతో ఇక్కడ ఒక కార్పొరేట్ దోపిడీ నడుస్తోంది. సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నికల్లో ఏళ్ల తరబడి ఒకే కుటుంబం ఏకపక్ష పెత్తనం చెలాయిస్తోంది. ఇటీవల తొమ్మిది మంది సభ్యుల కమిటీలో, ఏకంగా ఎనిమిది మందితోనే సమావేశం పెట్టి కొత్త అధ్యక్షుడిని ఎలా ఎన్నుకున్నారన్నది అంతుపట్టని విషయం. ఈ అక్రమ ఎన్నికపై అధికారులు కనీసం నోరు మెదపకపోవడం గమనార్హం. ఏటా కోట్లలో నడిచే ఈ కల్లు దందాలో సింహభాగం వాటా ఆ కుటుంబానికే దక్కుతుండగా, కల్లబొల్లి మాటలతో కార్మికులకు మాత్రం అరకొర వాటాలు పంచిపెడుతున్నారని కార్మికులే వాపోతున్నారు.
అధికారుల అండ ఎవరికి?
అక్టోబర్ 22న ఎక్సైజ్ అధికారులు ఈ మూడవ కల్లు డిపోపై దాడి చేశారు. ఆ సమయంలోనే డిపోకు లైసెన్స్ రెన్యువల్ లేదన్న వాస్తవం అధికారులకు తెలిసింది. మరి, తెలిసినా ఆరోజే డిపోను ఎందుకు సీజ్ చేయలేదు? అక్రమాలకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? తెర వెనుక డబ్బుల అక్రమ పంపకాలు ఏమైనా జరిగాయా? అన్న అనుమానాలు ఇప్పుడు బట్టబయలవుతున్నాయి.
కనీసం అప్పుడైనా చర్యలు తీసుకోని అధికారులు, ఆ తర్వాత డిపో డైరెక్టర్లు అంతర్గత విభేదాలతో కొట్టుకుని, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నాక... తీరిగ్గా డిపోను సీజ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డైరెక్టర్లు కొట్టుకునే వరకు మౌనం వహించిన అధికారులు, ఎక్కడ తమ అసమర్థత, అక్రమాలకు వత్తాసు పలికిన తీరు బయటకు వస్తాయోనన్న భయంతోనే ఆలస్యంగా డిపోను సీజ్ చేసి చేతులు దులుపుకున్నారని స్పష్టమవుతోంది. గతంలో ఇదే డిపోలో కల్తీ కల్లు తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు జరిగినా, అప్పుడు సైతం ఈ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట.
న్యాయస్థానమే దిక్కు..
ఈ డిపో నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలుకుతుండటంతో... ఇక కార్మికుల ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు కాపాడాలంటే జిల్లా కోర్టు జోక్యం చేసుకోవాలని కార్మికులు ఆశిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసి, ఒక ప్రత్యేక కమిటీ ద్వారా వాస్తవాలను వెలికితీయాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని వారు వేడుకుంటున్నారు.
మరోవైపు, గౌడ కులస్తులు సైతం జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, ఈ అక్రమ దందాపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు, అక్రమార్కుల మధ్య ఉన్న ఈ అపవిత్ర బంధం ఎప్పుడు తెగుతుందో, సంగారెడ్డి చెట్ల మాయాజాలం ఎప్పుడు వీడుతుందో, నిజమైన కార్మికులకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.