calender_icon.png 6 July, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాభసాటి ఉద్యాన పంటలు

06-07-2025 12:55:52 AM

  1. రైతులకు రాయితీలు అందజేస్తున్న ప్రభుత్వం 

సంప్రదాయ పంటలతో తప్పని నష్టం 

ఉద్యాన పంటలతోనే రైతులకు మేలు

పండ్ల తోటలు, కూరగాయలు, పూలు, తీగపందిరి పంటలు వేసుకోవాలి 

రైతులకు అవగాహన కల్పిస్తున్న సంబంధిత శాఖ అధికారులు   

హైదరాబాద్, జూలై ౫ (విజయక్రాంతి): విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు అన్నదాతలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం లాభసాటి అనేకంటే నష్టాలే అధికంగా ఎదురవుతున్నాయి. ఒక్కోసారి వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తుగ్గుతుం ది. ఒకవేళ పంట దిగుబడి వచ్చినా మద్దతు ధర రాకపోవడంతో రైతులు అనేక నష్టాలపాలవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపి తే లాభసాటిగా ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు రాయితీలు కల్పిస్తూ ఉద్యాన పంటలను ప్రోత్సహి స్తున్నాయి. తక్కువ నీటితో ఎక్కువ పంటలకు పండించడానికి అవకాశం ఉంటుంది.. తద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. తేలికపాటి భూముల్లో పండ్ల తోటలసాగుతో అధిక దిగుబడులు సాధించే అవకాశాలున్నాయి.

అందుకే ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాయితీలు కల్పిస్తూ.. ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్ల తోటలు, పందిరి పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. దీంతో రైతులు పంటల సాగులో విభిన్న పద్ధతులు అవలంబిస్తున్నారు.

గతంలో సంప్రదాయక, వాణి జ్య పంటలైన వరి, మొక్కజొన్న, పసుపు, పత్తి తదితర పంటలు సాగుచేసిన రైతులు మెల్లిగా పండ్లతోటలు, కురగాయల పంటల సాగువైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో పండ్ల తోటలు, కూరగాయల పంటల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఉద్యానశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పండ్లు, కూరగాయల పంటల వల్ల కలిగే లాభాలపై రైతులకు వివరిస్తున్నారు. 

భారీగా రాయితీలు..

ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం భారీగా రాయితీ అందిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీలను అందిస్తున్నాయి. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హర్టికల్చర్ (ఎంఐడీహెచ్ ) పథకం అమల్లో ఉంది. ఎంఐడీహెచ్ పథకంలో భాగంగా రైతులకు పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగుతోపాటు పంటలు పండించేందుకు అవసరమైన పరికరాలపైనా ప్రభు త్వం రాయితీ అందిస్తోంది.

డ్రాగన్ ప్రూట్ పంటకు ఎకరానికి రూ.64,800, బొప్పా యి, సీతాఫలం పంటల సాగుకు ఎకరానికి రూ.7,200, మామిడి, జామ, నిమ్మతోటలకు రూ.19,200, పూలసాగు, ఉల్లి, ప్లాస్టిక్ మాల్చింగ్ ఎకరాకు రూ.8,000 చొప్పున రాయితీలు కల్పిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఇక కూరగాయల సాగు విషయంలో రైతులు ఎక్కువగా తీగ పందిరి సాగుపై ఆసక్తి చూపుతున్నట్టు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూరగాయలు పంటలకు, పండ్ల తోటలకు, ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం అందుతోంది. ఈ పంటలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, ఇతరులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను అందజేస్తున్నారు.

నేషనల్ మిషన్ ఇంటిగ్రెటెడ్ డెవలప్‌మెంట్ పథకంలో భాగంగా 40 శాతం వరకు  సబ్సిడీ అందజేస్తున్నారు. తీగజాతి, పందిరి పంటలు సాగు చేసే రైతులకు అరఎకరానికి రూ.2.50 లక్షలు పెట్టుబడి అవసరం ఉండగా, ప్రభుత్వం రూ.50 వేలు అందజేస్తోంది.

ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి

వంట నూనెతో పాటు అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్‌పామ్‌ను కూడా ప్రభు త్వం ఎక్కువగానే  ప్రోత్సహిస్తోంది. ఆయిల్‌పామ్ పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇతర దేశాల నుంచి వంట నూనెలను పెద్దఎత్తున దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆయిల్‌పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే రైతులు అధిక లాభాలు ఆర్జించడంతో పాటు దిగుమతులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 

ఆయిల్‌పామ్ పంటను సాగు చేస్తు న్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ఖాతాల్లో జమ చేస్తూ.. ఆయిల్‌పామ్ మొక్కల కొనుగోలకయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ సబ్సిడీ రూపంలో కంపెనీలకు చెల్లిస్తోంది. మొక్కలు అందించిన కంపెనీలే బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయనుంది.

ఎకరం విస్తీర్ణంలో సుమారుగా 10 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చని, ఆయిల్‌పామ్ సాగులో రైతులు అంతర పంటలను కూడా చేసుకొని లాభాలు ఆర్జించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉద్యాన పంటలను సాగు చేసేందుకు ఆసక్తితో ఉన్న రైతులు స్థానికంగా ఉండే ఉద్యాన శాఖ అధికారులను సంప్రదింస్తే.. రైతులకు పూర్తి వివరాలు చెబుతారని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.