06-07-2025 06:32:56 PM
మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ. యాకుబ్ పాషా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కార్మిక శాఖ పర్యవేక్షణలో ఉండే సంస్థల్లో పని చేసే కార్మికుల పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచే విధంగా జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా(District Minority Welfare Association President MD. Yakub Pasha) ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రమ శక్తితోటి కార్పొరేట్లకు అధిక లాభాలను కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఒకపక్క మోడీ సర్కార్ 4 లేబర్ కోడ్లను తెస్తున్న నేపథ్యంలో దీన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 9న యావత్ కార్మిక లోకం సమ్మెకు సిద్ధమవుతుంటే, మరో పక్క రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ అడుగుజాడల్లో నడుస్తూ శనివారం కార్మిక శాఖ తీసుకొచ్చిన జీవోతో పని గంటలు10 పెంచడం దారుణమన్నారు.
కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకత విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9వ తేదీన జరిగే సమ్మెలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం అయిన ఐఎన్టీయూసీ (INTUC) సైతం పాల్గొంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించి పని గంటలు 10 పెంచడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్మికుల కు అండగా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 282 ను తక్షణమే రద్దు చేయాలని పేర్కొన్నారు.