19-11-2025 12:00:00 AM
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, నవంబర్ 18 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని శాబ్దిపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు చింతల సుమలత శ్రీనివాస్ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించి, లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. కలెక్టర్ ఇంటి నిర్మాణ పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకుంటూ పనులు ఎలా కొనసాగుతున్నాయి.
బ్యాంక్ నుండి ఎంత రుణం పొందారు, ఇప్పటి వరకు ఎంత వ్యయం చేశారు,ఇసుక సరఫరా పరిస్థితి, నిర్మాణానికి అవసరమైన ఇతర సౌకర్యాల లభ్యత వంటి విషయాలను తెలుసుకున్నారు. త్వరితగతిన పని పూర్తి చేసి, అర్హులైన ప్రతి కుటుంబం తమ స్వగృహంలో అడుగుపెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధి దారు సుమలత మాట్లాడుతూ, 2 లక్షలు రుణం తీసుకోవడం జరిగిందనీ, పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, స్లాబ్ వేయడం జరిగిందనీ, పనులు కొనసాగుతున్నాయని ఆన్నారు.
అదేవిధంగా సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఉద్దేశించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేస్త్రీలతో సమావేశాలు నిర్వహించారా, ప్రస్తుతం ఉన్న నిర్మాణ టార్గెట్ ఎంత, మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య ఎంత, క్యాన్సల్ చేసిన ఇళ్ల వివరాలు, కారణాలు, మార్క్ వుట్ చేసిన ఇళ్ల సంఖ్య, మార్క్ వుట్ అయిన వాటిలో ఇంకా నిర్మాణం ప్రారంభం కానివి ఎన్ని అనే అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి అర్హత గల కుటుంబం ప్రయోజనం పొందేలా పారదర్శకంగా, వేగవంతంగా పనులు కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ఇసుక ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆన్నారు. కలెక్టర్ వెంట పిడి హౌసింగ్ విజయ్ పాల్ రెడ్డి, ఎంపిడిఓ,ఎంపీఓ, పంచాయితి సెక్రటరి, తదితరులు ఉన్నారు.