19-11-2025 12:00:00 AM
మహబూబాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను, నిర్వాహకులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం. మహబూబాబాద్‌మండలంలో మూడుపూగల్, అయోధ్య, ఆమనగల్, ఐకెపి, సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కేంద్రాల వద్ద రైతుల సౌకర్యార్థం త్రాగునీరు, నిలువ నీడ, కూర్చోవడానికి చైర్స్ సదుపాయాలు కల్పించాలని, సన్న వడ్లు, దొడ్డు వడ్లు కేంద్రాలను వేరువేరుగా ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోళ్లు చేసి వెంట వెంటనే గోదాములకు తరలించాలని, వాతావరణ మార్పులు తదితర అంశాలపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు.
రవాణా చేయు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లే కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతు వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసి డబ్బులు త్వరితగతిన వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.కేంద్రాల్లో ధాన్యం వివరాలు రిజిస్టర్, గన్ని సంచుల రిజిస్టర్, రైతుల వారి కొనుగోళ్ల చెల్లింపుల రిజిస్టర్, రవాణా, స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ తనిఖీల్లో ఏడీఏ శ్రీవాసరావు, తహసిల్దార్ రాజేశ్వరరావు, ఏవో తిరుపతి రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.