calender_icon.png 22 January, 2026 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదోన్నతులు చరిత్రగా మిగిలిపోతాయి

22-01-2026 01:23:36 AM

సీఎం, ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు 

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి

16 మందికి ఐఏఎస్‌లుగా ప్రమోషన్

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): గ్రూపు-2లో డిప్యూటీ తహసీల్దార్లుగా ఎంపికైన 16 మందికి ఐఏఎస్(కన్ఫర్డ్)లుగా పదోన్నతి కల్పించడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏనాడు కూడా ఏకకాలంలో 16 మందికి ఐఏఎస్ రాలేదన్నారు. ఇంత భారీ మొత్తంలో గ్రూపు 2 అధికారులకు  ఐఏఎస్(కన్ఫర్డ్)లుగా పదోన్నతి కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం లచ్చిరెడ్డి.. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన 16 మందికి లచ్చిరెడ్డి, ఇతర జేఏసీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. 

సీఎస్ దృష్టికి ఉద్యోగుల సమస్యలు

కాగా రాష్ట్రంలోని వివిధ విభాగాలలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీఎస్‌ను లచ్చిరెడ్డి కోరారు. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన బిల్లులు, ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ శాఖలో తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల వివరాలను కూడా సీఎస్ దృష్టకి తీసుకెళ్లారు. ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి, రెండవ త్రైమాసికాల కోసం తహసీల్దార్లకు నెలకు రూ.33 వేల చొప్పున అద్దె వాహనాల ఖర్చులను మంజూరు చేసిందన్నారు.

దాని  ప్రకారం తహసీల్దార్లు ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలలో బిల్లులు సమర్పించినప్పటికీ  క్లెయిమ్ కాలానికి సంబంధించి ప్రభుత్వం నుండి కొనసాగింపు ఉత్తర్వులు అవసరమని పేర్కొంటూ ఆ బిల్లులను తిరస్కరించారని గుర్తు చేశారు. 2025 ఆర్థిక సంవత్సరానికి తహసీల్దార్లకు కేటాయించిన అద్దె వాహనాల ఖర్చులను క్లెయిమ్ చేసుకునేందుకు కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా కోరారు. అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు సీఎస్ సానుకూలంగా స్పందించారని ఛైర్మన్ లచ్చిరెడ్డి, జేఏసీ నాయకులు ఎస్.రాములు, రమేష్ పాక, దర్శన్గౌడ్, రజిని, సమ్మయ్య, తెలిపారు. 

డీటీ పరశురాంకు పరామర్శ

అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల డిప్యూ టీ తహసిల్దార్ పరశురాంను డీప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని  పరశురాం కుటుంబ సభ్యులకు మనోధైర్యంతో పాటు ఆర్థిక భరోసా అందించారు. పరశురాంను పరామర్శించిన వారిలో టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ వి భిక్షం, నాగర్‌కర్నూల్ జిల్లా టీజీఆర్‌ఎస్‌ఏ రమేష్, టీజీఆర్‌ఎస్‌ఏ కె రాములు. జీపీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ ఉన్నారు.