22-01-2026 01:23:10 AM
ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, జనవరి 21 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లా కీర్తి ప్రతీకా 140 సంవత్సరాలకు పైగా ఘనకీర్తి గల వనపర్తి లోని రాజగారి బంగ్లా (రాజ మహాల్) వందల సంవత్సరాలైనా ఆదరణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటుందని గమనించిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రాజమహల్ పునరుద్ధరణ పై ప్రత్యేక దృష్టి సారించారు. వనపర్తి ఘన కీర్తని చాటి చెప్పే రాజుగారి బంగ్లాను కాపాడుకోవాలని తలచిన వనపర్తి శాసనసభ్యులు రాజుగారి బంగ్లా పునరుద్ధరణకై మొదటినుంచి దృష్టి సారించారు. పలుమార్లు బంగ్లా పునరుద్ధరణ కోసం చేపట్టవలసిన అంశాలపై పలువురి నిపుణులతో సమగ్ర పరిశీలనను నిర్వహించారు.
అనంతరం బంగ్లా పునరుద్ధరణ కోసం నివేదికలను తయారు చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి సమర్పించగా ఇందుకు సంబంధించిన ఆయన మొదటగా బంగ్లాలో కొనసాగుతున్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఇబ్బందులను తొలగించేందుకు వారికి బాలుర మరియు బాలికల ప్రతి గృహాల పునరుద్ధరణ కోసం రూ .13 కోట్ల 15 లక్షల ను ఇటీవల మంజూరు చేయించారన్నారు.
రాజగారి బంగ్లా పునరుద్ధరణ కోసం నిధులు మంజూరు చేయాలని పలుమార్లు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ని కోరగా అందుకు స్పందించిన ఆయన రూ .10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ బుధవారం జీవో జారీ చేశారన్నారు. వనపర్తి చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిపోయిన పూర్వ వైభవం రాజుగారి బంగ్లాను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే చేసిన కృషికి వనపర్తి జిల్లా పరిధిలోని విద్యావేత్తలు, సంఘసంస్కర్తలు, సాహితీ వేత్తలు, కళాకారులు, నిపుణులు, ప్రజలు ప్రశంసించారు