14-11-2025 12:44:47 AM
ఎస్పీ యం. రాజేశ్ చంద్ర
కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): పోలీస్ పిఆర్వోలు ప్రజలతో పోలీసులను కలిపి వంతెనలుగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. హైదరాబాద్లోని పేట్లబుర్జ్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మూడు రోజులపాటు జరిగిన పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డీజీపీ శివదర్ రెడ్డి, పి ఆర్ ఓ ల శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబర్చిన పీఆర్వోలను అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జి. రాములు అద్భుత ప్రతిభ కనబరిచారు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివదర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర,పీఆర్వో రాములు ను అభినం దించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ పీఆర్వోలు ప్రజలతో పోలీసులను కలిపే వంతెనలుగా ఉండాలి.
ప్రతి సంఘటనలో పోలీసు శాఖ యొక్క నిజమైన రూపాన్ని సమాజానికి చేరవేయడం మీ ప్రధాన బాధ్యత. మీ మాట, మీ రాత ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ఉండాలి. సమాచారం స్పష్టంగా, సమయానికి అందించడం ద్వారా పోలీసు శాఖ ప్రతిష్ట మరింత బలపడుతుంది. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అత్యంత కీలకం అని పేర్కొన్నారు. ఎస్పీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పీఆర్వో జి. రాములు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రజా సేవలో కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధిలో వినియోగిస్తానని తెలిపారు.