26-07-2025 08:15:04 PM
జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): లైంగిక వేధింపులు, గృహహింసకు, అత్యాచారo కు గురైన బాధితులకు న్యాయ, వైద్య, సైకాలజికల్ సపోర్టు వంటి సేవలు ఒకే దగ్గర అందించాలన్న సంకల్పంతో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో భరోసా సెంటర్ పని తీరు, బాదిత మహిళలకు అందుతున్న సేవల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్ లో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పొక్సో, అత్యాచార కేసులలో బాధితులను అక్కున చేర్చుకొని, వారిలో ధైర్యాన్ని నింపి, వారి సమస్యకు సత్వర పరిష్కారం దిశగా అన్నిరకాల సేవలను భరోసా సెంటర్ నందు అందించాలని అన్నారు. డ్యూటీ పరంగా ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని, ఒక్కొక్క విభాగానికి చెందిన సిబ్బంది అందిస్తున్న సేవలను వివరంగా అడిగి తెలుసుకొని, తగు సలహాలు సూచనలు చేశారు. భరోసా సిబ్బందిని ఉద్దేశించి ఎస్పి మాట్లాడుతూ బాధితులకు న్యాయం అందించడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, రాత్రి పగలు అని తేడా లేకుండా ఎళ్లవేలలా పిల్లల, మహిళల రక్షణకు అందుబాటులో ఉండాలని సూచించారు.
బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగనీయకుండా అన్ని శాఖల అధికారుల కో-ఆర్డినేషన్ తో విధులు నిర్వహించాలని అన్నారు. భరోసా సెంటర్ సేవల గురించి జిల్లాలో విద్యార్థులకు, మహిళలకు కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించలని భరోసా సెంటర్ సిబ్బందికి సూచించారు.జిల్లాలో భరోసా సెంటర్ ప్రారంభమైన నాటి నుండి సత్ ఫలితాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న భరోసా సిబ్బందిని ఎస్పీ అభినందించారు.