04-11-2025 04:44:25 PM
							కన్నెర్ర చేసిన తాండూరు
న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన.
తాండూరు (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మిర్జాగూడ వద్ద జరిగిన బస్సు-టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో తాండూరు నియోజకవర్గానికి చెందిన ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, చిన్నారులు మృతి చెందడానికి కారణం గత ప్రభుత్వ పాలకులు, ప్రస్తుత ప్రభుత్వ పాలకులేనని ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో తాండూర్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో విలియామన్ చౌరస్తా వద్ద ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు రోడ్డుపై బైఠాయించి నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీర్జాపూర్ రోడ్డు ప్రమాదంలో తాండూర్ ప్రాంతానికి చెందిన 12 మంది మృతిచెందడం తీవ్రంగా కలచి వేసిందని.. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. తాండూర్ నుండి హైదరాబాద్ వరకు రోడ్డు అభివృద్ధి చేయడంలో గత, ప్రస్తుత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యమే కారణమని.. రోడ్లు అభివృద్ధి చేసి, డివైడర్లు వేసి ఉంటే గనక రోడ్డు ప్రమాదం జరిగి ఉండేది కాదని.. ప్రాణాలు పోయేవి కావని.. ఇన్ని జీవితాలు చిద్రం అయ్యేవి కావని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలూరు గేటు వద్ద జరిగిన ప్రమాదం జరిగిన తర్వాత పాలకులు అప్రమత్తమయ్యి రోడ్లు బాగు చేసి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని అన్నారు. ఇప్పటికైనా తాండూరు హైదరాబాద్ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలి.. న్యాయం చేయాలంటూ ఆందోళనకారులు చేసిన నినాదాలతో దద్దరిల్లింది. వర్షం కురుస్తున్న కూడా లెక్క చేయకుండా ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వాల తీరుపై కన్నెర్ర చేశారు. ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరైన కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.