calender_icon.png 19 September, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులోకి దూకి తండ్రి, కూతురు ఆత్మహత్య..

18-09-2025 11:19:19 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందుల వలన చెరువులో దూకి ఓ తండ్రి, తన కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బహదూర్ పల్లి, ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్(50) వంటపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని భార్య సోనీ(45) మూడు ఏళ్ల క్రితం రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో ఎడమ కాలు పూర్తిగా తీసివేశారు. అప్పట్నుంచి ఆమె ఇంట్లోనే ఉండడం, అతనికి పనులు దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే మూడు రోజుల క్రితం ఇంట్లో సిలిండర్ ఓపెన్ చేసి రాత్రి సమయంలో మంట పెట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు.

కానీ అతని భార్య బయటకు వచ్చి అరవడంతో స్థానికులు వచ్చి మంటలను అదుపు చేశారు. తర్వాత రోజూ సాయంత్రం 5 గంటల సమయంలో అశోక్, తన కూతురు దివ్య (5)ని తీసుకొని వెళ్లి మైసమ్మగూడ లోని సెయింట్ పీటర్స్ కాలేజ్ వెనుక ఉన్న చెరువులో కూతురితో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో స్థానికుల నుండి పేట్ బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందడంతో, పోలీసులు హైడ్రా సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.