19-09-2025 12:08:56 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు వన మహోత్సవం కింద పకడ్బందీ కార్యచరణ రూపొందించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. జిల్లాలు, మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు సన్నద్ధమవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి మొక్కులు నాటడంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని వందశాతం సాధించాలని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
సచివాలయంలో గురువారం వనమహోత్సం కార్యక్రమంపై మంత్రి సురేఖ సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతుకు ముందు అటవీ అధికారులు సిద్ధం చేసిన పీపీటీని మంత్రి కొండా సురేఖ, ప్రిన్స్‌పల్ సెక్రటరీ, పీసీసీఎఫ్ వీక్షించారు. ఇప్పటివరకు మొక్కలు నాటిన ప్రాంతాలకు జీయో టాగింగ్ పూర్తయినట్టు అధికారులు వివరించారు. ఈ ఏడాదికిగానూ 18.03 కోట్ల మొక్కలు టార్గెట్ పెట్టుకోగా 13.84 కోట్ల మొక్కల ప్లాంటేషన్ (77 శాతం) పూర్తి చేసినట్టు తెలిపారు.
రాష్ర్టవ్యాప్తంగా పచ్చదనాన్ని మరింత విస్తరింపచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. అన్ని డిపార్టుమెంట్‌లలో ఈ మొక్కలు నాటుతున్నప్పుడు ఎదరవుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టి వచ్చింది. అయితే, గత ఏడాది అనుభవాల ఆధారంగా మరింత పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.